Coronavirus: కరోనా లెక్కల్లో కచ్చితత్వం ఉండాల్సిందే.. బూస్టర్‌ డోస్‌ పంపిణీపై వైరాలజిస్టులు ఏమంటున్నారంటే..

Coronavirus: కరోనా లెక్కల్లో కచ్చితత్వం ఉండాల్సిందే.. బూస్టర్‌ డోస్‌ పంపిణీపై వైరాలజిస్టులు ఏమంటున్నారంటే..

Coronavirus: కరోనా కొత్త వేరియంట్లు కలకలం సృష్టిస్తోన్న వేళ..18 ఏళ్ల పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Basha Shek

|

Apr 12, 2022 | 10:31 PM

Coronavirus: కరోనా కొత్త వేరియంట్లు కలకలం సృష్టిస్తోన్న వేళ..18 ఏళ్ల పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ని ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలోనూ ఆదివారం అనగా ఏప్రిల్ 10వ తేదీ నుంచి బూస్టర్ డోస్ అందుబాటులోకి తెచ్చింది. మొదటి రోజే 9,674 ప్రికాషనరీ డోసులను పంపిణీ చేసింది. కాగా కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకుని తొమ్మిది నెలలు గడిచిన వారు ఈ బూస్టర్ డోస్‌కు అర్హులు. కాగా కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను చాలామంది స్వాగతిస్తున్నారు. అదే సమయంలో బూస్టర్‌ డోస్‌ వైరస్‌ నుంచి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తుందా? దీనికేమైనా ఆధారాలు ఉన్నాయా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిలోనూ నిజాలు లేకపోలేదు. ఎందుకంటే కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి కొవిడ్‌ డేటా సేకరణ విషయంలో భారత ప్రభుత్వం అలక్ష్యంగానే వ్యవహరిస్తుందంటూ పలువురు వైరాలజిస్టులు, వైద్య నిపుణులు విమర్శిస్తున్నారు. దీని వల్ల వ్యాక్సిన్ల ప్రభావం కచ్చితంగా తెలవడం లేదంటున్నారు.

ప్రజలకు జవాబుదారీగా ఉండాలి..

కాగా ఈ ఏడాది జనవరి నుంచే 60 ఏళ్ల పైబడిన వారికి, ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ వర్కర్లకు ప్రికాషనరీ డోస్(బూస్టర్)ను పంపిణీ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే 60 ఏళ్లు పైబడిన వారికి ఏ ప్రాతిపదికన ముందస్తుగా బూస్టర్‌ డోస్‌ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు ప్రముఖ వైరాలజిస్టు గగన్‌దీప్‌ కాంగ్. కచ్చితమైన ట్రయల్స్‌, పరిశోధనల ఆధారంగానే టీకా పంపిణీ ఉండాలని ఆమె సూచించారు. అంతేకానీ ఇబ్బడిముబ్బడిగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసి ఇవ్వడం ఎంతమాత్రం మంచిది కాదని సూచించారు కాంగ్‌. ఇదే విషయంపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఆక్స్‌ఫర్డ్ సెంటర్ ఫర్ ఇస్లామిక్ స్టడీస్ అండ్ రీసెర్చ్ విభాగం నిపుణులు డాక్టర్ షాహిద్ జమీల్ న్యూస్ 9తో మాట్లాడారు. ‘ సైన్స్‌ అనేది డేటా, ఎవిడెన్స్ లపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజల కోసం పాలసీ విధానాలు రూపొందించే వారు వీటిని త్వరగా అర్థం చేసుకోవాలి. అంతేకానీ ఇష్టారీతి విధానాలతో సైన్స్‌ను బ్లాక్ బాక్స్‌గా చేయకూడదు. పాలసీ విధానాలు రూపొందించే వ్యక్తులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజారోగ్యం గురించి ఎలాంటి సందేహాలు, అనుమానాలు ఎదురైనా సమాధానం చెప్పాలి. ఉదాహరణకు ఒమిక్రాన్‌ కట్టడి విషయంలో అమెరికా విధానాలు గొప్పగా పని చేయలేదు. అయితే ప్రజారోగ్యం గురించి తమ విధి విధానాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలను డేటా ఆధారంగానే తెలియజేశారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ కచ్చితమైన డేటాతో నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకు మాస్క్‌ లు ధరించాలి? మోల్నుపిరావిర్‌ను చికిత్సలో ఎందుకు ఉపయోగించాలి? అన్న ప్రశ్నలకు ఆయన దగ్గర కచ్చితమైన డేటా సేకరణ ఉంది. అందుకే ప్రెస్‌మీట్లు, కాన్ఫరెన్స్‌ లలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ధైర్యంగా సమాధానాలిచ్చారు. ఇక మన దేశ విషయానికి వస్తే.. నేషనల్ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ తమ వద్ద ఎలాంటి డేటా అందుబాటులో లేదని, జనవరి 2022 మొదటి వారంలో బూస్టర్‌పై చర్చించేందుకు సమావేశమవుతామని చెప్పారు. అయితే డిసెంబర్‌లోనే బూస్టర్‌ డోస్ కోసం ప్రకటన ఇచ్చారు. ఇది పబ్లిక్‌ పాలసీ వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనం’ అని డాక్టర్‌ జమీల్‌ చెప్పుకొచ్చారు.

అంతా గందరగోళం!

ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ , నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ జయప్రకాష్ ములియిల్ కరోనా డేటా సేకరణలో వైఫల్యంపై న్యూస్‌9తో మాట్లాడారు. ‘కొవిడ్‌కు సంబంధించి డేటా సేకరించడంలో మనకు చిత్తశుద్ధి లేదు. పైగా ఇది చాలా గందరగోళంగా ఉంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ మన కేంద్ర ప్రభుత్వం మూడవ డోస్‌ని ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇది తప్పనిసరి కాదని నా అభిప్రాయం. టీకాల సామర్థ్యానికి సంబంధించి మన దగ్గర కచ్చితమైన సమచారం లేదు. అదేవిధంగా రెండు టీకాల మధ్య వ్యవధికి సంబంధించి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. మరి అలాంటప్పుడు బూస్టర్‌ డోస్‌ కరోనా నుంచి ప్రజలకు ఎలా రక్షిస్తుందని ఎలా చెప్పగలం? ఎంతో కఠినమైన టీకా ప్రణాళిక ఉంటే తప్ప ఈ డేటాను పొందడం చాలా కష్టం. కరోనా డేటా సేకరణలో వైఫల్యం కారణంగా కచ్చితమైన ఫలితాల కోసం భారత్‌ ఇజ్రాయెల్‌, యూరప్ దేశాలవైపు చూడాల్సిన పరిస్థితి దాపరించింది. కరోనా డేటా గురించి తెలుసుకునేందుకు ఈ దేశాల్లో ప్రతి ఒక్కరికీ యాక్సెస్‌ ఉంటుంది. మనదేశంలో కూడా అలాంటి విధానాన్ని తీసుకురావాలి. ఆర్థిక విధానాలు, రాజకీయ విధానాలను ఎలా రూపొందించాలో మనకు తెలుసు. అయితే దురదృష్టవశాత్తు సైన్స్ ఆధారిత విధానాలను రూపొందించే చరిత్ర మనకు తెలియరావడం లేదు. కాబట్టి 18 సంవత్సరాలకు పైగా బూస్టర్ మంచి ఆలోచనేనా? అంటే ఇప్పుడే చెప్పలేం. ఒమిక్రాన్‌ మనపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ప్రకృతి మనకు సహజమైన రోగనిరోధక శక్తిని ఇచ్చింది. దానితోనే వైరస్‌లను జయించేందుకు ప్రయత్నం చేద్దాం’ అని డాక్టర్‌ ములియల్‌ చెప్పుకొచ్చారు.

Also Read: EV’s Firing: అగ్నికి ఆహుతైన 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. కారణాలు కనుక్కునే బాధ్యతను ఆ IITకి అప్పగింత..

Grand Weddings: సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన పెళ్లిళ్లు ఇవే!

Travel Insurance: ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం ఎలా లెక్కిస్తారో తెలుసా..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu