గ్రీన్‌జోన్ జిల్లాలో 21 మందికి కరోనా పాజిటివ్ !
రెడ్ జోన్‌లలో ఆంక్షలు కఠినంగా కొనసాగనుండగా.. గ్రీన్, ఆరెంజ్ జోన్‌లలో పరిమితంగా పనులకు వెసులబాటు కల్పించారు. అయితే, అక్కడ గ్రీన్ జోన్‌లో ఏకంగా 21 కోవిడ్ కేసులు బయటపడటంతో అధికారులు ఖంగుతిన్నారు.

దేశంలో కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. గడచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా దాదాపు 2700మందికి కొత్తగా వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42533 దాటింది. ఇక వైరస్ వ్యాప్తిని అదుపుచేయడానికి విధించిన లాక్‌డౌన్ మూడో దశ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. వైరస్ కేసుల నమోదు ఆధారంగా దేశం మొత్తాన్ని మూడు జోన్‌లుగా విభజించి, ఆంక్షలతో కూడిన కార్యకలాపాలకు గ్రీన్, ఆరెంజ్ జోన్‌లలో అనుమతి ఇచ్చారు.
ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా లేని ప్రాంతాలను గ్రీన్ జోన్‌గా.. 10లోపు కేసులు ఉన్న ప్రాంతాన్ని ఆరెంజ్ జోన్, పెద్ద సంఖ్యలో కేసులు నిర్ధారణ అయిన ప్రాంతాలను రెడ్ జోన్‌గా పరిగణిస్తారు. రెడ్ జోన్‌లలో ఆంక్షలు కఠినంగా కొనసాగనుండగా.. గ్రీన్, ఆరెంజ్ జోన్‌లలో పరిమితంగా పనులకు వెసులబాటు కల్పించారు. అయితే, అక్కడ గ్రీన్ జోన్‌లో ఏకంగా 21 కోవిడ్ కేసులు బయటపడటంతో అధికారులు ఖంగుతిన్నారు.
భారత్‌లో కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. కర్ణాటకలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం నాటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 614కు చేరుకుంది. ఇక వారం రోజుల క్రితం గ్రీన్ జోన్‌గా ప్రకటించబడిన దావణగెరెలో ఆదివారం ఒక్కరోజే 21 మందికి వైరస్ సోకడంతో కలకలం రేగింది. మే 1, 2 తేదీల్లో కరోనా లక్షణాలు ఉన్న 72 మంది శాంపిళ్లు.. ఆదివారం రోజు 164 మంది శాంపిళ్లు పరీక్షకు పంపగా.. వారిలో 21 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు అక్కడి వైద్యాధికారులు వెల్లడించారు.
కాగా, దావణగెరె జిల్లాలో అంతకుముందు 10 కరోనా కేసులు నమోదు కాగా.. వారిలో ఇద్దరు కోలుకున్నారు. ఒకరు మరణించారు. కొన్ని రోజులుగా యాక్టివ్ కేసులు లేకపోవడంతో దావణగెరెను గ్రీన్‌జోన్ పరిధిలోకి తీసుకువచ్చారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో జిల్లాను రెడ్ జోన్ పరిధిలోకి తెచ్చి.. లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.