AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా నుంచి కోలుకున్న వారిలో ఆ సమస్యలు…తాజా సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి

Covid-19 Study: కరోనా బారిన పడుతున్న ప్రజల సంఖ్య ఒక వైపు పెరుగుతోంది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న తర్వాత వ్యక్తులు మళ్లీ వైరస్ బారిన పడే ప్రమాదమేకాక ఇతర వ్యాధులకు గురయ్యే అవకాశం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కరోనా నుంచి కోలుకున్న వారిలో ఆ సమస్యలు...తాజా సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి
Covid News
Janardhan Veluru
|

Updated on: May 11, 2021 | 12:24 PM

Share

కరోనా బారిన పడుతున్న ప్రజల సంఖ్య ఒక వైపు పెరుగుతోంది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న తర్వాత వ్యక్తులు మళ్లీ వైరస్ బారిన పడే ప్రమాదమేకాక ఇతర వ్యాధులకు గురయ్యే అవకాశం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్-19 తర్వాత తలెత్తే పరిస్థితులను పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్‌గా వైద్యులు చెబుతున్నారు. చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన కరోనా బాధితులకి కరోనా మళ్ళీ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

ఇటీవల కరోనా వచ్చి కోలుకున్న వారిపై జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న 72శాతం మంది అలసట, నీరసం సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. కొవిడ్ నుంచి విముక్తి పొందిన వారిలో 10.8 శాతం మంది తమలో ఎలాంటి ఇతర వ్యాధుల లక్షణాలు లేవని తెలిపారు. అతి తక్కువ మంది తమలో ఊపిరితిత్తుల సమస్యలు, మూత్ర పిండాల వైఫల్యం, గుండెకు సంబంధించిన సమస్యలు, స్ట్రోక్ తదితర సమస్యలు తలెత్తాయని వెల్లడించారు. పోస్ట్ కొవిడ్ పరిస్థితుల్లో వ్యక్తులకు మల్టీ ఆర్గాన్ల( అవయవాలు) సమస్యలు వస్తున్నాయని సర్వేలో తేలింది.

శ్వాసకోశ వ్యవస్థపై… కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంతమంది అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిందని సర్వేలో తేలింది. కొవిడ్ సోకిన సమయంలో ఊపిరితిత్తుల్లోని వాయు గోణులు, కణాలు దెబ్బతిని ఊపిరితిత్తుల్లో మంట ఏర్పడుతోంది. ఫలితంగా కొవిడ్ నుంచి బయటపడిన వారిలో కొంతమందికి దీర్ఘ కాలంలో శ్వాసక్రియలో సమస్యలు వచ్చే అవకాశముంది.

గుండె-రక్త నాళాలపై… కొవిడ్ సోకడానికి ముందే గుండె, రక్త ప్రసరణ వ్యవస్థలో తలెత్తే సమస్యలు వారికి ప్రాణాపాయం కలిగిస్తాయి. ఆ సమయంలో చికిత్స కూడా కష్టమే. కొవిడ్ నుంచి కోలుకుని నెగటివ్ వచ్చినప్పటికీ.. వారిలో గుండె కొట్టుకోవడంలో తేడాలు, ఛాతిలో నొప్పి, గుండె కండరాలు దెబ్బతినడం, గుండె వైఫల్యం చెందే అవకాశాలు పెరగడం.. తదితర సమస్యలు వస్తాయంటున్న వైద్యులు చెబుతున్నారు.

మూత్ర పిండాలపై… పోస్ట్ కొవిడ్ ప్రభావాల్లో మూత్ర పిండాల సమస్య కూడా ఒకటి. మూత్రపిండాల పని మందగించడం, డయాబెటిస్, రక్తపోటు ఉన్న వారిలో మూత్ర పిండాల వైఫల్యం చెందే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సమయాల్లో మూత్ర పిండాల వైఫల్యం వల్ల డయాలిసిస్ అవసరం కావచ్చు. ఎలాంటి కిడ్నీ వ్యాధులు లేకున్నప్పటికీ.. యువ పేషెంట్లు కిడ్నీల్లో సమస్యలు ఎదుర్కొనే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారు.

కాలేయంపై… కొంతమంది కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కాలేయం మునపటి సాధారణ స్థాయికి చేరుకోకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. శరీరంలోని రోగ నిరోధక కణాలు సొంత కణాలపై దాడిచేసే అవకాశం(సైటోకైన్ స్టోర్మ్) ఉందంటున్నారు. ఇన్ఫెక్షన్ సమయంలో వాడిన మందులతో వచ్చే దుష్ప్రభావాల్లో రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

మెదడుపై…. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంతమందిలో కంగారుపడటం, మత్తుగా ఉండటం, దృష్టి మసకబారటం, ఒక అంశంపై మనసు కేంద్రీకరించడంలో వైఫల్యం, ఆలోచనల్లో స్పష్టత లోపించడం వంటి లక్షణాలు కనిపించాయని చైనాలో నిర్వహించిన సర్వోలో వెల్లడయ్యింది.

జీర్ణ వ్యవస్థపై…. కొవిడ్ నుంచి రికవరీ అయిన వారిలో చాలామంది తమలో పొత్తి కడుపులో నొప్పి, వికారం, డయేరియా, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు, ప్రేగుల్లో రక్త స్రావం, సాధారణ స్థాయిలో చేరుకోవడంలో ఇబ్బందులు కనిపించాయని  వైద్యులు తెలిపారు.

పోస్ట్ కొవిడ్ పై వచ్చే సమస్యలపై మరిన్ని పరిశోధనలు.. కొవిడ్-19 రికవరీ తర్వాత దీర్ఘకాలంలో కన్పించే ప్రభావాలపై ఇంకా పరిశోధనలు సాగించాల్సిన అవసరముందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది పేషెంట్లు వేగంగా రికవరీ అవుతుండగా, కొంతమంది సాధారణ స్థాయికి నెమ్మదిగా చేరుకుంటున్నారని వెల్లడించారు.

10-5-2021 వరకు కొవిడ్ వరల్డ్ మీటర్ గణాంకాలు.. దేశంలో నిన్నటివరకు నమోదైన కరోనా మొత్తం కేసులు 2,29,91,927 మొత్తం మరణాలు 2,50,025, రికవరీ అయిన వారి సంఖ్య 1,90,21,207 నిన్న ఒక్క రోజే కొత్తగా నమోదైన కేసులు 3,29,517, మరణాలు 3,879 క్రియాశీల కేసులు 37,20,695

ఇవి కూడా చదవండి..వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్నాకా కరోనా సోకిందా ? అయితే రెండవ డోస్ తిరిగి ఎప్పుడు వేసుకోవాలో తెలుసా ?

వ్యాక్సినేషన్ సవాల్.. కేంద్రం ముందు పెద్ద టాస్క్.. జూలై నాటికి 30 కోట్ల మందికి టీకా సాధ్యమేనా.!