కరోనాః అక్కడ 10కి చేరిన పాజిటివ్ కేసులు
కరోనా భూతం పంజా దాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 41కి చేరగా, అటు ఏపీలోనూ కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 8 నుంచి 10కి చేరింది.
కోవిడ్ః 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. భారత్‌లోనూ దావానలం విస్తరిస్తోంది. కరోనా భూతం పంజా దాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 41కి చేరగా, అటు ఏపీలోనూ కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 8 నుంచి 10కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో బుధవారం మరో రెండు పాజిటివ్ కేసులు నమోదుకావడంతో ఆందోళన నెలకొంది. విజయవాడ, గుంటూరుకు చెందిన ఇద్దరికి పాజిటివ్‌గా వచ్చినట్లు బుధవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. వీరిద్దరు ఇతర ప్రాంతాల నుంచి ఇటీవలే వచ్చినట్లుగా గుర్తించారు.
విజయవాడ గాయత్రినగర్‌కు చెందిన యువకుడు అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు. ఈనెల 20న ఢిల్లీ మీదుగా ఇంటికి చేరుకున్నాడు. ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు చెక్ చేసిన తర్వాతే పంపారు. సోమవారం అనుమానంతో తండ్రితో కలిసి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా పరీక్షలో కరోనా సోకినట్లు నిర్ధారించారు. గుంటూరుకు చెందిన మరో వ్యక్తి ఈనెల 14న ఓ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లాడు. సమావేశంలో అతనితో పాటు 20 మంది పాల్గొన్నట్లు సమాచారం. మూడు రోజుల తర్వాత 18వ తేదీ అతను తిరుగు ప్రయాణం అయి 19వ తేదీ విజయవాడలో రైలు దిగి గుంటూరు వెళ్లాడు. 23వ తేదీన అనుమానం వచ్చి ఆస్పత్రిలో చేరగా కరోనా వైరస్ సంక్రమించినట్లుగా నిర్ధారణ అయ్యింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు అనుమానిత లక్షణాలున్న 312 మంది నుంచి నమూనాలు సేకరించి వైద్య పరీక్షలకు పంపించారు.. అందులో 229 నెగిటివ్ కాగా మరో 73 నమూనాలకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. బుధవారం ఒక్కరోజు 13 నమూనాలు పంపించారు. రాష్ట్రంలో హోం క్వారంటైన్‌లో ప్రస్తుతం 15,143 మంది ఉన్నారని బులెటిన్‌లో పేర్కొన్నారు. 97 మంది ఆస్పత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గత రెండు రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల సంఖ్య ఒక్కటి కూడా నమోదు కాలేదని వెల్లడించారు.