Andhra Pradesh: ఏపీలో మరోసారి కర్ఫ్యూ పొడిగింపు.. కీలక ఆదేశాలు జారీ
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి రాత్రి కర్ఫ్యూ పొడిగించింది. ప్రజారోగ్యం దృష్ట్యా కఠిన నిర్ణయాలు తప్పవని సీఎం జగన్ స్పష్టం చేశారు.
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కర్ఫ్యూ ఆంక్షల్ని ఈ నెల 30 వరకు కొనసాగిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005, భారత శిక్షా స్మృతి (IPC) సెక్షన్ 188, ఇతర నిబంధనల ప్రకారం కింద చర్యలుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, ఇకపై పెళ్లిళ్లకు 150 మందికి మాత్రమే పర్మిషన్ ఉందని సీఎం జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఒకవేల తెల్లవారుజామున పెళ్లిళ్లు ఉంటే.. ముందస్తు అనుమతి తప్పనిసరి అని వెల్లడించారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పండుగల విషయంలో కూడా జగన్ సర్కార్ ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ప్రజారోగ్యం దృష్యా కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని సీఎం తెలిపారు.
కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, షాపుల్లోకి మాస్కులు లేని వారిని అనుమతిస్తే జరిమానా విధిస్తారు. ఫైన్ మొత్తాన్ని అక్కడి పరిస్థితుల ఆధారంగా ఖరారు చేస్తారు. అలాగే 2-3 రోజులపాటు సంబంధిత సంస్థను మూసివేసేలా చర్యలు తీసుకుంటారు. ఎవరైనా కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే నిబంధనలు అతిక్రమించిన వారిపై సంబంధిత అధికార వర్గాలు చర్యలు తీసుకుంటారు.
Also Read: మానవత్వం చాటిన ఎంపీటీసీ.. పేదింటి గర్భిణీకి సీమంతం.. శభాష్ అంటున్న జనాలు..