AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగురాష్ట్రాల్లో మారిన పది, ఇంటర్ – 2022 పరీక్షల షెడ్యూళ్లు! అసలెందుకు మార్చారో తెలుసా..

ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ 2022 పరీక్షల రీ షెడ్యూల్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ తేదీల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి..

తెలుగురాష్ట్రాల్లో మారిన పది, ఇంటర్ - 2022 పరీక్షల షెడ్యూళ్లు! అసలెందుకు మార్చారో తెలుసా..
Inter Exams
Srilakshmi C
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 16, 2022 | 2:54 PM

Share

AP and TS Board Exams: ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ 2022 పరీక్షల రీ షెడ్యూల్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ తేదీల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పది, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన కొత్త టైం టేబుల్లను తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసింది. మారిన తేదీల ప్రకారం.. మే 6 నుంచి మే 24 వరకు ఇంటర్ ఫస్టియర్‌ (మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీలు), సెకండియర్‌ (మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీలు) ఎగ్జామ్స్ జరుగుతాయని తెలంగాణ ఇంటర్‌ బోర్డు (TSBIE) వెల్లడించింది. జేఈఈ (JEE Main 2022) పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఆటంకం కలగకుండా ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మారడం ఇది రెండోసారి. ఇంటర్‌ జనరల్‌, వొకేషనల్‌ కోర్సులకు సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించనున్నారు. అలాగే ఎథిక్స్ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 11, 12 తేదీల్లో జరుగుతాయి. నిజానికి జేఈఈ మెయిన్‌కు ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మాత్రమే హాజరవుతారు. ఎంపీసీ, బైపీసీ, ఇతర గ్రూపుల ప్రధాన సబ్జెక్టులకు 19 రోజులు పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు మే 4తో జేఈఈ మెయిన్‌ పరీక్షలు ముగుస్తాయి. ఈ పరీక్షకు హాజరయ్యినవారు మే 7న ఇంటర్‌ పరీక్షలకు హాజరవుతారు. అంటే మధ్యలో రెండు రోజుల వ్యవధి ఉంటుందన్నమాట. పరీక్షల షెడ్యూల్‌ మార్చకపోతే జేఈఈ మెయిన్‌ పరీక్ష రాసిన వారు మర్నాడే ఇంటర్‌ పరీక్ష రాయాలవల్సి వచ్చేది. ఈ సమస్యను పరిష్కరించడానికే ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసి, తాజాగా కొత్త టైంటేబుల్‌ను విడుదల చేసింది.

ఏపీలో ఇంటర్‌ పరీక్షలు ఇలా.. ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. మారిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 22 నుంచి పరీక్షలు మొదలై మే 12 వరకు జరుగుతాయి. గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 28వ వరకు జరగాల్సి ఉంది. కానీ జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. మరోవైపుఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. నిజానికి విద్యాశాఖ తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 2 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ దీనిని తొమ్మిదో తేదీకి మార్చనున్నట్లు సమాచారం. దీంతో ఒకేసారి ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. అక్కడ టెన్త్‌ పరీక్ష కేంద్రాలను వేరేచోటుకు మార్చడానికి వీలుపడటం లేదు. ఇంటర్, టెన్త్‌ పరీక్షలు ఒకేసారి జరిగితే రెండిటి ప్రశ్నపత్రాలు, సమాధానాల బుక్‌లెట్లు, ఇతర పరీక్ష సామగ్రి భద్రపరిచేందుకు పోలీసు స్టేషన్లలో వసతి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు భద్రతకు, వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకానికి కూడా సమస్య వస్తుంది. ఈ నేపథ్యంలో టెన్త్‌ పరీక్షలను వారం రోజులు వాయిదా వేయాలని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మే 9 నుంచి లేదా 13 నుంచి పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ యోచిస్తోంది.

జేఈఈ మెయిన్‌ పరీక్ష తేదీలతో ఎందుకీ సమస్య? జేఈఈ మెయిన్‌ తేదీల్లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగకూడదు. అలాగని పక్కపక్క తేదీల్లో కూడా రాకూడదు. ఒక రోజు జేఈఈ, మరో రోజు ఇంటర్‌ పరీక్షలు రాయడం విద్యార్ధులకు కష్టంగా ఉంటుంది. విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముందే ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తే ఆ తర్వాత రెండు, మూడు రోజులకే జేఈఈ మెయిన్‌ పరీక్షలు రాయవల్సి వస్తోంది. దేశ వ్యాప్తంగా జరిగే జేఈఈ పరీక్షకు గట్టిపోటీ ఉంటుంది. పరీక్షకు సిద్ధమవడానికి విద్యార్థులకు తగిన సమయం ఉండదు. అంతేకాకుండా ఈసారి రెండు విడతల్లోనే జేఈఈ మెయిన్‌ జరుగుతున్నందున విద్యార్థులు చివరి విడతపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రస్తుతం జేఈఈ మెయిన్‌ పరీక్షల నిర్వహణ తేదీలు పది, ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు అడ్డుగా పరిణమించాయి.

విద్యార్థుల విన్నపం మేరకు జేఈఈ మెయిన్‌ మొదటి విడత తేదీలను నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ (ఎన్టీఏ) మార్చి14న‌ రీ-షెడ్యూల్‌ చేసింది. దీని ప్రకారం ఏప్రిల్‌ 16కు (ఏప్రిల్‌16 నుంచి 21వరకు) బదులు ఏప్రిల్‌ 21 నుంచి మే 4 వరకు జరుగుతాయని ప్రకటించింది. అంటే ఏప్రిల్‌ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో జరుగుతుందన్నమాట. ఇక రెండో విడత పరీక్షలు మే 24 నుంచి 29 వరకు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ రెండోసారి మారింది. ఇంతకుముందు ప్రకటించిన జేఈఈ మెయిన్‌ తేదీలను దృష్టిలో పెట్టుకొని.. 12 రోజుల క్రితం ఇంటర్‌ పరీక్షల తేదీలను ఒకసారి మార్చిన విషయం తెలిసిందే. అటు ఏపీలోనూ ఇంటర్‌, పది పరీక్షల తేదీలను మార్చవల్సి వస్తోంది.

టెన్త్‌ పరీక్షలు కూడా ప్రభావితం అవుతున్నాయి.. ఇంటర్‌ పరీక్షల తేదీలు మారితే పదో తరగతి పరీక్షల తేదీలను సైతం తెలంగాణ విద్యాశాఖ మార్చింది. మారిన తేదీల ప్రకారం మే 23 నుంచి 28 వరకు టెన్త్ పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. ఏపీ పదో తరగతికి మారిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటించనుంది.

వీటన్నింటి దృష్ట్యా బాధ్యతాయుతంగా వ్యవహరించవల్సిన జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహించే ఎన్టీఏ ఇష్టారాజ్యంగా తేదీలు ప్రకటిస్తే దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బోర్డు పరీక్షలు రాసే విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని సర్వత్రా విమర్విస్తున్నారు. రాష్ట్రాల్లోని ఇంటర్‌ పరీక్షల తేదీలను పరిగణనలోకి తీసుకోకుండానే జేఈఈ తేదీలను ఖరారు చేయడంవల్లనే సమస్యంతా అని ఆయా బోర్డులు దెప్పిపొడుస్తున్నాయి. అంతేకాకుండా మే నెల్లో తీవ్రంగా ఎండలు ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఇబ్బంది తప్పదు.

Also Read:

Metabolism: ఆహారం సరిగ్గా జీర్ణం కావట్లేదా? ఐతే ఇలా చేయండి..