UPSC Civil Services 2023 Toppers List: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో టాప్ 10 ర్యాంకర్లు వీరే.. మెరిసిన ఐఐటీ గ్రాడ్యుయేట్స్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 తుది ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 16) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో ఆదిత్య శ్రీవాస్తవ ఫస్ట్ ర్యాంక్, అనిమేశ్ ప్రధాన్ రెండో ర్యాంక్ సొంతం చేసుకోగా.. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి ఆలిండియా మూడో ర్యాంకు కైవసం చేసుకుంది. పి.కె.సిద్ధార్థ్ రామ్‌కుమార్‌కు నాలుగో ర్యాంకు..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2023 తుది ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 16) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో ఆదిత్య శ్రీవాస్తవ ఫస్ట్ ర్యాంక్, అనిమేశ్ ప్రధాన్ రెండో ర్యాంక్ సొంతం చేసుకోగా.. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి ఆలిండియా మూడో ర్యాంకు కైవసం చేసుకుంది. పి.కె.సిద్ధార్థ్ రామ్‌కుమార్‌కు నాలుగో ర్యాంకు, రుహానీకు ఐదో ర్యాంకు లభించింది. సృష్టి దబాస్ ఆరో ర్యాంకు, అన్మోల్ రాథోడ్ 7వ ర్యాంకు, ఆశిష్ కుమార్కు 8వ ర్యాంకు, నౌషీన్‌కు 9వ ర్యాంకు, ఐశ్వర్యం ప్రజాపతికు 10వ ర్యాంకు.. తొలి పది ర్యాంకు వీరు సొంతం చేసుకున్నారు. 2023వ సంవత్సారానికి గానూ అఖిల భారత సర్వీసులకు మొత్తం 1,016 మంది ఎంపికైనట్ల యూపీఎస్సీ ప్రకటించింది. వీరిలో 664 మంది పరుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. టాప్ 5 ర్యాంకర్లలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉండగా.. టాప్ 25 ర్యాంకర్లలో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన అభ్యర్థుల్లో దివ్యాంగులు 30 మంది ఉన్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది.
కాగా యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ 2023కు దేశ వ్యాప్తంగా 10.16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5.92 లక్షల మంది పరీక్షకు హాజరైతే 14,624 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఇక వీరిలో 2,855 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. మూడు దశల్ల ఫిల్టర్ చేసి చివరకు 1,016 మందిని కేంద్ర సర్వీసులకు యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఎంపికైన మొత్తం అభ్యర్ధుల్లో జనరల్ కేటగిరీలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 115 మంది, ఓబీసీలో 303 మంది, ఎస్సీలో 165 మంది, ఎస్టీలో 86 మంది ఉన్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో కేంద్ర సర్వీసులకు ఎంపికైన విజేతలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలుపుతూ మంగళవారం ‘ఎక్స్’లో పోస్టు షేర్ చేశారు.
టాప్ ర్యాంకర్లుగా నిలిచిన ఐఐటీ గ్రాడ్యుయేట్స్
ఈసారి సివిల్స్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఆదిత్య శ్రీనివాస్తవ మెయిన్స్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను తన ఆప్షన్‌గా ఎంచుకున్నారు. ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ (బీటెక్) పూర్తిచేశారు. రెండో ర్యాంక్ సాధించిన అనిమేశ్ ప్రధాన్ ఐఐటీ రూర్కెలాలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ అభ్యసించారు. సివిల్స్ మెయిన్స్‌లో ఆప్షనల్‌గా సోషియాలజీని ఎంచుకున్నారు. సివిల్స్ మూడో ర్యాంకర్ తెలంగాణకు చెందిన దోనూరు అనన్యరెడ్డి ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(ఆనర్స్) జాగ్రఫీ చదివారు. సివిల్స్ మెయిన్స్‌లో ఆంథ్రోపాలజీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. అత్యంత కష్టసాధ్యమైన పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ సర్వీసెస్ ఒకటి. ఎంతో నిబద్ధతతో ప్రిపేరయ్యేవారు మాత్రమే ఇందులో మెరుస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.