AP EAPCET 2024: ఏపీ ఈఏపీసెట్‌కు పోటెత్తిన దరఖాస్తులు.. ఇప్పటి వరకూ 3,46,324 దరఖాస్తులు
రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ 2024కి మార్చి 12 నుంచి దరఖాస్తులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీతో గడువు ముగిసింది. దీంతో సోమవారం నాటికి దాదాపు 3,46,324 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్ స్ట్రీంలో 2,62,981 మంది, అగ్రికల్చర్..
అమరావతి, ఏప్రిల్ 16: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ 2024కి మార్చి 12 నుంచి దరఖాస్తులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీతో గడువు ముగిసింది. దీంతో సోమవారం నాటికి దాదాపు 3,46,324 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్ స్ట్రీంలో 2,62,981 మంది, అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీంలో 82,258 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు రెండింటికీ కలిపి 1085 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ డీఏపీ కె వెంకటరెడ్డి తెలిపారు. అయితే ఈసారి ఈఏపీసెట్‌కు భారీగా దరఖాస్తులు అందినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ స్థాయిలో ఎప్పుడూ దరఖాస్తులు రాలేదని ఆయన అన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి దాదాపు 8 వేలకు పైగా అదనంగా దరఖాస్తులు వచ్చాయి. ఇక ఇంజనీరింగ్ విభాగంలో సుమారు 24 వేలకు పైగా అధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఆలస్య రుసుముతో మే 12 వరకు దరఖాస్తుకు అవకాశం ఇస్తున్నట్లు ఇప్పటికే షెడ్యూల్‌లో వెల్లడించారు
రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 30 వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో మే 5 వరకు, రూ.5000 ఆలస్య రుసుంతో మే 10 వరకు, రూ.10,000 ఆలస్య రుసుంతో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ముగింపు తేదీ నాటికి దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కన్వినర్ తెలిపారు. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ మే 4 నుంచి 6 వరకు ఇచ్చారు.
మే 16 నుంచి ఈఏపీసెట్ పరీకలు ప్రారంభం
ఏపీ ఈఏపీసెట్‌ను మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో జరుగుతుంది. ఇంజనీరింగ్ విభాగంలో మే 18 నుంచి 22 వరకు ప్రవేశపరీక్షలు నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి సన్నాహాలు చేస్తోంది. ఆయా తేదీల్లో రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలను నిర్వహిస్తారు. మే 7 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.