TS Police Prelims Exam 2022: ఆగస్టు 7వ తేదీన ఎస్సై ప్రిలిమ్స్ రాత పరీక్ష.. కానిస్టేబుల్ పరీక్ష ఎప్పుడంటే..!
తెలంగాణ రాష్ట్రంలో 17,291 పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటి (మే 26 రాత్రి 10 గంటలకు)తో ముగియనుంది. ఐతే రాత పరీక్షలకు సంబంధించిన తేదీలను నోటిఫికేషన్లతోపాటు ప్రకటించలేదు. పోలీస్ నియామక ప్రక్రియలో తొలుత నిర్వహించే ప్రిలిమ్స్ రాత పరీక్ష..
TSLPRB Police Constable Prelims exam date 2022: తెలంగాణ రాష్ట్రంలో 17,291 పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటి (మే 26 రాత్రి 10 గంటలకు)తో ముగియనుంది. ఐతే రాత పరీక్షలకు సంబంధించిన తేదీలను నోటిఫికేషన్లతోపాటు ప్రకటించలేదు. పోలీస్ నియామక ప్రక్రియలో తొలుత నిర్వహించే ప్రిలిమ్స్ రాత పరీక్ష (TSLPRB Prelims exam date)ను ఆగస్టులో నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఆగస్టు 7న ఎస్సై పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(TSLPRB) సన్నాహాలు చేస్తోంది. ఇక ఆగస్టు 21న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకపోతే దాదాపుగా ఇవే తేదీలు ఖరారు కానున్నాయి. ఒకవేళ ఆ తేదీల్లో టీఎస్‌పీఎస్సీకి సంబంధించిన పరీక్షలు ఉంటే స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చు. ముందుగా ఎస్సైల ఎంపిక ప్రక్రియ, ఆ తర్వాత రెండు వారాలకు కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రచించారు. దీనివల్ల ఎస్సైలుగా ఎంపికైన వారిని కానిస్టేబుల్ పోటీ నుంచి తప్పించే వీలుంటుంది. తెలంగాణలో ఈసారి భారీఎత్తున 17,291 పోస్టులను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో 587 ఎస్సై పోస్టులు కాగా.. మిగిలినవన్నీ కానిస్టేబుల్ పోస్టులే. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు కలిపి మే 25 వరకు సుమారు 12.1 లక్షల దరఖాస్తులొచ్చాయి.
కానిస్టేబుల్ పోస్టులకు పోటెత్తిన దరఖాస్తులు మే 26న గడువు ముగిసే నాటికి సుమారు 14 లక్షల దరఖాస్తులు రావొచ్చని, వీటిలో కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తులే 9 నుంచి 11 లక్షలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాథమిక రాతపరీక్షలకు సంబంధించి జూన్ 10 నాటికి కసరత్తు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హాల్‌టికెట్ల జారీతో పాటు పరీక్ష కేంద్రాల ఎంపిక ప్రక్రియను అప్పటిలోగా పూర్తి చేయనున్నారు. 2018 నోటిఫికేషన్‌లో భాగంగా సివిల్, ఏఆర్, ఎస్‌ఏఆర్ సీపీఎల్, టీఎస్‌ఎస్పీ, ఎస్పీఎఫ్, అగ్నిమాపకశాఖ, జైళ్లశాఖ సిబ్బంది నియామకాలు చేపట్టారు. ఈసారి అదనంగా రవాణా, ఎక్సైజ్‌శాఖ సిబ్బంది నియామకాల బాధ్యతనూ ఆయా శాఖలు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీకే అప్పగించాయి. వాటిలోనూ కానిస్టేబుల్ పోస్టులే ఉండటంతో మండలి ద్వారా శారీరక సామర్థ్య పరీక్షల నియామకాలు చేపడితే ఫలితాలు పక్కాగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.
అంచనాలకు మించి.. 2018 నోటిఫికేషన్‌లో దాదాపు ఇన్నే పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టారు. అప్పట్లో సుమారు 6 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దాంతో పోల్చితే ఈసారి రెట్టింపు కంటే ఎక్కువ దరఖాస్తులు రావడం విశేషం. క్రితంసారి కేవలం పోలీసుల నియామకాలే జరిగాయి. ఈసారి టీఎస్‌పీఎస్‌సీ పోస్టులకూ నోటిఫికేషన్లు రావడంతో ఉద్యోగార్థులు అటువైపు కూడా దృష్టి సారిస్తారని.. 7 లక్షల దరఖాస్తులే రావొచ్చని తొలుత అంచనా వేశారు. అయితే అనూహ్యంగా దరఖాస్తులు పోటెత్తాయి. తొలుత మే 20 నాటికే దరఖాస్తుల సమర్పణకు గడువుండగా.. యూనిఫాం పోస్టులకు ప్రభుత్వం రెండేళ్ల వయోపరిమితి పెంచడంతో గడువును మే 26 వరకు పొడిగించారు. దీంతో దరఖాస్తులు అంచనాలను మించాయి.
అక్టోబరు రెండో వారంలో దేహ దారుఢ్య (PMT, PET) పరీక్షలు నిర్వహిస్తామని, నవంబరులోగా ఫలితాలు ప్రకటిస్తామని.. జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్ రాత పరీక్షలుంటాయని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు ఇప్పటికే ప్రకటించారు. అన్నీ సవ్యంగా సాగితే మార్చిలోపు తుది ఫలితాల్ని ప్రకటిస్తామన్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.