TGSRTC Driver Jobs 2025: ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం.. డైరెక్ట్ లింక్ ఇదే
TGSRTC begins online registrations for 1743 Driver and Shramik Posts: ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల నోటిఫికేషన్‌కు నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించినట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు అభ్యర్థులకు సూచనలు చేసింది. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు సర్టిఫికెట్లను కొత్తగా సూచించిన ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నది..

హైదరాబాద్, అక్టోబర్ 8: తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 1,743 డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం డ్రైవర్ పోస్టులు1000, శ్రామిక్ పోస్టులు 743 వరకు ఉన్నాయి. ఇక ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు బుధవారం (అక్టోబర్ 8 ) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన పురుష, మహిళా అభ్యర్ధులు ఎవరైనా అక్టోబర్ 28, 2025వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో ఎస్సీ కమ్యూనిటీ అభ్యర్థులు తమ కమ్యూనిటీ సర్టిఫికెట్లను కొత్త నిర్దేశిత ఫార్మాట్‌లో అంటే గ్రూప్– ఐ /గ్రూప్– ఐఐ / గ్రూప్– ఐఐఐ ఉప–వర్గీకరణతో ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని సూచించారు. అభ్యర్థులు సకాలంలో కొత్త సర్టిఫికెట్‌ను పొందలేకపోతే, వారి వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయవచ్చని ఆయన సూచించారు. అయితే అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో కొత్త ప్రొఫార్మాలో కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేశారు. లేదంటే వారిని ఎస్సీ కేటగిరీ కింద పరిగణించబోమని వెల్లడించారు.
ఈ పోస్టుల్లో డ్రైవర్ పోస్టులకు రూ.20,960 నుంచి రూ.60,080 కాగా, శ్రామిక్ పోస్టులకు రూ.16,550 నుంచి రూ. 45,030 వరకు జీతాలు చెల్లిస్తారు. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికపై భర్తీ చేస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఇక శ్రామిక్ పోస్టులకైతే నిర్దిష్ట విద్యార్హతలు ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు ఖచ్చితంగా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్ తదితర ఆధారంగా ఎంపిక చేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




