Rajiv Yuva Vikasam 2025: నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్.. రాజీవ్ యువ వికాసం రాయితీ వాటా భారీగా పెంపు
నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాల మంజూరు నిబంధనలపై ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. యూనిట్లను నాలుగు క్యాటగిరీలుగా విభజించి, రాయితీ నిధుల వాటాను భారీగా పెంచింది. గతంలో అమలు చేసిన స్వయం ఉపాధి పథకాల కన్నా మెరుగ్గా నిబంధనలు..

హైదరాబాద్, మార్చి 24: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాల మంజూరు నిబంధనలపై ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. యూనిట్లను నాలుగు క్యాటగిరీలుగా విభజించి, రాయితీ నిధుల వాటాను భారీగా పెంచింది. గతంలో అమలు చేసిన స్వయం ఉపాధి పథకాల కన్నా మెరుగ్గా నిబంధనలు రూపొందించడంతోపాటు పకడ్బందీగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చి 22న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సంక్షేమశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో యూనిట్ల వ్యయం, రాయితీ వాటాను ఖరారు చేసి, ప్రకటన జారీ చేశారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఎవరైనా ఏప్రిల్ 5, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాదికి రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది యువతకు రూ.6 వేల కోట్ల ఖర్చుతో ప్రభుత్వం రాయితీ రుణాలను ఈ పథకం కింద మంజూరు చేయనుంది. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్స్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. లబ్ధిదారుల్లో అర్హులను ఎంపికచేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అంటే జూన్ 2న లబ్ధిదారులకు సంబంధిత పత్రాలను అందజేస్తారు.
ఏపీపీఎస్సీ ఫారెస్ట్ కన్జర్వేటర్ పోస్టుల ప్రాథమిక ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లోని ఫారెస్ట్ కన్జర్వేటర్ పోస్టులకు ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.
నేటి నుంచి తెలంగాణ డీఈఈసెట్ 2025 దరఖాస్తులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌కు ఈ రోజు (మార్చి 24వ తేదీ) నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మే 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మే 25వ తేదీన ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఈసారి విద్యాశాఖ ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకుడు రమేశ్‌ను డీఈఈసెట్ కన్వీనర్‌గా నియమించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.