TS Inter Exams 2023: తెలంగాణ ఇంటర్ విద్యార్థులూ.. ఈ టోల్ ఫ్రీ నెంబర్ 14416కు ఫోన్ చేయండి..
నార్సింగి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య నేపథ్యంలో పరీక్షలు సమీపించే కొద్దీ ఒత్తిడి, భయం వంటి ఇతర మానసిక సమస్యల వల్ల విద్యార్ధులు తొందరపాటు చర్యలకు పూనుకోకుండా..
నార్సింగి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. సాత్విక్ సూసైడ్ నోట్‌లో.. శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్, ఆచార్య క్యాంపస్ ఇంచార్జి నరేష్, శోభన్‌లు తనను వేధిస్తున్నారంటూ పేర్కొన్నాడు. వీళ్ల మెంటల్ టార్చర్ వల్లే చనిపోతున్నానని, హాస్టల్లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారని, వీటిని తట్టుకోవడం తన వల్ల కావట్లేదని, ఇలాంటి వేధింపులు ఇంకెవరికీ రాకుండా వీరందరిపై కఠినచర్యలు తీసుకోవాలి తన సూసైడ్ నోట్‌లో తెలిపాడు. ఈ ఆత్మహత్య నేపథ్యంలో పరీక్షలు సమీపించే కొద్దీ ఒత్తిడి, భయం వంటి ఇతర మానసిక సమస్యల వల్ల విద్యార్ధులు తొందరపాటు చర్యలకు పూనుకోకుండా.. వాటిని మానసిక నిపుణులకు చెప్పుకొని పరిష్కరించుకునేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కొత్తగా టోల్ ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చింది. గతంలో కూడా కొందరు సైకాలజిస్టులను ఇంటర్‌బోర్డు నియమించేది.
ఈ ఏడాది కూడా టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండర్ నెట్‌వర్కింగ్ అక్రాస్ ది స్టేట్స్(టెలీ-మానస్) పేరిట టోల్ ఫ్రీ నంబరు 14416ను తీసుకొచ్చారు. ఈ నంబరుకు విద్యార్ధులెవరైనా ఉచితంగా ఫోన్ చేసి పరిష్కారం పొందొచ్చు. ఇంటర్ వార్షిక, సప్లిమెంటరీ పరీక్షలు, ఫలితాల ప్రకటన సమయాల్లో దాన్ని వినియోగించుకోవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. అలాగే ఆయా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ క్లినిక్‌ల పేరిట ఉచితంగా సైకాలజిస్టులు సేవలు అందిస్తారు. వారిని స్వయంగా కలిసి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మార్చి 15వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితియ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి విధితమే.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.