TGPSC Group1 Exam: తెలంగాణ గ్రూపు1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు హైకోర్టు నో.. జూన్ 9న యథావిథిగా పరీక్ష
తెలంగాణలో జూన్ 9న జరగాల్సిన గ్రూపు1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయడానికి హైకోర్టు మంగళవారం (జూన్ 4) నిరాకరించింది. గ్రూప్ 11 ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ ఇద్దరు అభ్యర్ధులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జూన్ 9న ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రెండో స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున, ఈ పరీక్షకు అర్హత సాధించిన..
హైదరాబాద్, జూన్ 5: తెలంగాణలో జూన్ 9న జరగాల్సిన గ్రూపు1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయడానికి హైకోర్టు మంగళవారం (జూన్ 4) నిరాకరించింది. గ్రూప్ 11 ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ ఇద్దరు అభ్యర్ధులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జూన్ 9న ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రెండో స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున, ఈ పరీక్షకు అర్హత సాధించిన ఎం గణేష్, భూక్య భరత్ అనే ఇద్దరు అభ్యర్ధులు గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్.. పిటిషన్‌ను కొట్టివేసి, గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ను ఖరారు చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. మెజారిటీ అభ్యర్థుల ప్రయోజనం కోసం పరీక్షను వాయిదా వేయలేమని స్పష్టం చేసింది.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 4.3 లక్షల మంది అభ్యర్థుల్లో 2,75,300 మంది అభ్యర్థులు మంగళవారం ఉదయం 10 గంటలలోపు తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని కమిషన్ తరపు న్యాయవాది తెలిపారు. ఇద్దరు అభ్యర్థుల సౌలభ్యం కోసం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయడం వల్ల 4 లక్షల మందిపైగా ప్రతికూల ప్రభావం పడుతుందని వాదించారు. గ్రూప్-1 పరీక్షల షెడ్యూల్‌ను చాలా ముందుగానే ప్రకటించారని పేర్కొన్న న్యాయవాది ఈ వాదనను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తిక్ అంగీకరించారు.
తెలంగాణ రాష్ట్రంలో 2 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు కేవలం 700 మంది అభ్యర్థులు మాత్రమే పోటీ పడుతున్నారని, గ్రూప్-1కు 4 లక్షలకుపైగా ఆశావహులు పోటీపడుతున్నారని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కొంత మంది ప్రయోజనం కోసం ఇన్ని లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టడం సరికాదన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయడానికి నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు.