తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ.. వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు షురూ!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. భవిష్యత్తులో విద్యుత్తు అవసరాలను తీర్చేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025కి తాజాగా శ్రీకారం చుట్టిన రేవంత్ సర్కార్.. 2030 నాటికి 20 వేల మెగావాట్ల అదనపు పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచడము లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా పదేళ్లలో ఏకంగా 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు ఈ రంగంలో సృష్టించనున్నారు..
హైదరాబాద్, జనవరి 6: తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో విద్యుత్తు అవసరాలను తీర్చేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ను ప్రకటించింది. పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, సమన్వయ అభివృద్ధి లక్ష్యంతో రూపొందించిన ఈ విధానం 2030 నాటికి 20 వేల మెగావాట్ల అదనపు పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు రాబోయే 10 ఏళ్లలో రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.14 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించనుంది. కాలుష్య కారక తీవ్రతను 33% తగ్గించడమే ఈ విధానం లక్ష్యం.
వృద్ధితో పెరిగే డిమాండ్
ప్రభుత్వం చేపడుతున్న మెట్రో విస్తరణ, ఫార్మాసిటీ, ఏఐ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు వంటి పెద్ద ప్రాజెక్టులతో విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 2024-25లో గరిష్ట డిమాండ్ 15,623 మెగావాట్లుగా ఉండగా, 2034-35 నాటికి ఇది 31,809 మెగావాట్లకు చేరనుంది.
పాలసీ ముఖ్య ఉద్దేశాలు ఇవే..
- వివిధ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు అందించడం. ఫ్లోటింగ్ సోలార్, విండ్ పవర్, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ ప్రాజెక్టులకు భారీగా సబ్సిడీలు, పన్ను మినహాయింపులు. సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు ప్రైవేటు, ప్రభుత్వ స్థలాలు అందుబాటులోకి తీసుకురావడం.
- రూలింగ్ లీనియన్స్.. అంటే భూ వినియోగ మార్పులకు అనుమతి అవసరం లేదు. భూముల కొనుగోలుపై 100% స్టాంప్ డ్యూటీ రీయింబర్స్ అందించడం జరుగుతుంది.
- ప్రత్యేకంగా మహిళలకు ప్రోత్సాహకం అందించాలి. మహిళా స్వయం సహాయక సంఘాలకు 500 కిలోవాట్ నుండి 2 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించడం.
- రూఫ్‌టాప్ ప్రాజెక్టులు.. ప్రభుత్వ పాఠశాలలు, ఇందిరమ్మ గృహాలు, పంచాయతీ భవనాలపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం కలిగించడం.
- పెట్టుబడులకు వేగవంతమైన అనుమతులు అందించడం. ఇందుకోసం టీజీ-ఐపాస్ ద్వారా అన్ని రకాల అనుమతులు వేగంగా జారీ చేయడం జరుగుతుంది. వీటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్వోసీ అవసరం లేదు.
ఫ్యూచర్ పోకస్
తెలంగాణలో గల అనుకూల వాతావరణ పరిస్థితులు సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తికి పెద్దగా సహకరిస్తాయి. 300 రోజులు సౌర విద్యుత్తు అందుబాటులో ఉండే రాష్ట్రం, గాలులు బలంగా వీచే 8 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ పాలసీ ద్వారా తెలంగాణ గ్రీన్ ఎనర్జీ సెక్టార్‌లో దేశవ్యాప్తంగా కీలక ప్రదేశంగా మారనుంది. సమన్వయ అభివృద్ధి లక్ష్యంతో పాటు పర్యావరణ రక్షణకు దోహదపడే ఈ విధానం రాష్ట్రాన్ని ఒక నూతన శక్తి కేంద్రంగా మార్చనుంది.