BTech Field Students: బీటెక్ ఫెయిలైన విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. సగం క్రెడిట్లకే సర్టిఫికెట్లు!
యేటా బీటెక్ చదివే విద్యార్ధులు వేలల్లోనే ఉన్నారు. నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ చదివినా అన్ని సబ్జెక్టులు గట్టేది మాత్రం కొందరే. అధిక శాతం మందికి సబ్జెక్టులు క్లియర్ చేయడమే ఓ పెద్ద గండం. దీంతో నాలుగేళ్లు బీటెక్ చదివిన విద్యార్ధులకు ఏదైనా ఒక్క సబ్జెక్టులో తప్పితే ఆ సబ్జెక్టు క్లియర్ చేసేంత వరకు డిగ్రీ పట్టా చేతికి రాదు. దీంతో ఆ విద్యార్థి నాలుగేళ్ల కాలం..

హైదరాబాద్, మార్చి 31: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యేటా బీటెక్ చదివే విద్యార్ధులు వేలల్లోనే ఉన్నారు. నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ చదివినా అన్ని సబ్జెక్టులు గట్టేది మాత్రం కొందరే. అధిక శాతం మందికి సబ్జెక్టులు క్లియర్ చేయడమే ఓ పెద్ద గండం. దీంతో నాలుగేళ్లు బీటెక్ చదివిన విద్యార్ధులకు ఏదైనా ఒక్క సబ్జెక్టులో తప్పితే ఆ సబ్జెక్టు క్లియర్ చేసేంత వరకు డిగ్రీ పట్టా చేతికి రాదు. దీంతో ఆ విద్యార్థి నాలుగేళ్ల కాలం వృథా అయిపోయినట్లు అవుతుంది. ఇక నుంచి ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు సగం క్రెడిట్లు.. అంటే 50 శాతం సబ్జెక్టులు పాసైనా ఆ మేరకు ఓ సర్టిఫికెట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. నాలుగేళ్ల బీటెక్‌లో మొత్తం 160 క్రెడిట్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్‌కు 20 క్రెడిట్లు చొప్పున ఇస్తారు. కనీస మార్కులతోనైనా అన్ని సబ్జెక్టులు పాసైతే వారికి 160 క్రెడిట్లు వస్తాయి. ఒక్కో సెమిస్టర్‌కు ఐదారు సబ్జెక్టులుంటాయి. మొత్తం సబ్జెక్టుల్లో సగం పాసైతే 80 క్రెడిట్లు పొందుతారు.
కానీ ప్రస్తుత విధానంలో ఏ ఒక్క సబ్జెక్టు తప్పినా ఆ విద్యార్థి బీటెక్ పట్టా పొందేందుకు అర్హులు కాదు. ఇలాంటి వారికి కూడా సర్టిఫికెట్ ఇవ్వాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలో విధివిధానాలను రూపొందించనుంది. యూనివర్సిటీల్లో పరీక్షల ఫీజు, ఒక ఏడాది నుంచి మరో ఏడాదికి ప్రమోట్ అయ్యేందుకు అవసరమైన క్రెడిట్లు రకరకాలుగా ఉండటంపై కూడా అధికారులు చర్చించే అవకాశం ఉంది. అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తారు.
సర్కార్ బడుల్లో ఆరు, ఏడు తరగతుల అబ్బాయిలకు కూడా ఇకపై ప్యాంట్లు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతులు చదువుతున్న అబ్బాయిలకు నిక్కర్లకు బదులుగా ప్యాంట్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, మోడల్, కేజీబీవీ, జనరల్ రెసిడెన్షియల్ గురుకులాలు, ఎయిడెడ్, గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా రెండు జతల యూనిఫాం అందిస్తున్న సంగతి తెలిసిందే. అబ్బాయిలకు ఏడో తరగతి వరకు నిక్కర్లు, 8 నుంచి 10 తరగతుల వారికి ప్యాంట్లు ఇస్తున్నారు. అయితే ఆరు, ఏడు తరగతులు చదువుతున్న అబ్బాయిలు తమకు కూడా ప్యాంట్లు కావాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో కొందరు తమకు ఇచ్చే రెండు జతల నిక్కర్ల వస్త్రం మొత్తాన్ని ఒక ప్యాంటుగా కుట్టించుకుని బడులకు వెళ్తున్నారు. దీన్ని గమనించిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆరు, ఏడు తరగతులకు కూడా ప్యాంట్లు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు జతల నిక్కర్లకు బదులు రెండు జతల ప్యాంట్లు అందించనున్నట్లు ప్రకటించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.