TG TET 2024 Hall Tickets: టెట్ అభ్యర్ధులకు సర్కార్ షాక్.. పరీక్ష రాసేందుకు తప్పని తిప్పలు! అభ్యర్ధిక్కడ ఎగ్జాం సెంటర్ ఎక్కడో..
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్ 2024) పరీక్షలు జవవరి 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ తాజాగా హాల్ టికెట్లు కూడా జారీ చేసింది. అయితే ప్రతి యేడాది మాదిరిగానే టెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపు ప్రక్రియలో అభ్యర్ధులకు చుక్కలు చూపించేందుకు సిద్ధమైంది..
హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్ 2024) పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే అధిక మంది హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా పరీక్షలు రాసేందుకు అభ్యర్ధులకు తిప్పలు తప్పడం లేదు.
ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్టులను జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష, జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు మొత్తం 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే టెట్ దరఖాస్తు సమయంలో పరీక్ష కేంద్రాల ఎంపికకు ఏకంగా 16 కేంద్రాలు ఎంచుకునేందుకు ఆప్షన్ ఇచ్చారు.
సాధారనంగా ఏ పరీక్షకు అయినా 3 నుంచి 5 ప్రాంతాలను మాత్రమే పరీక్ష కేంద్రాలుగా ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. టెట్‌లో 16 అప్షన్లు ఇవ్వడంతో అభ్యర్ధులకు జారీ చేసిన హాల్ టికెట్లలో పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడో పడ్డాయి. తొలి ప్రాధాన్యం ఇచ్చిన జిల్లాలో కాకుండా… చివరి ప్రాధాన్యంగా ఇచ్చిన సుదూర ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. దీంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న వేల మందికి ఇదే పరిస్థితి.
తాజాగా సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్ధికి సిద్దిపేట కేటాయించారు. మొత్తం 16 ప్రాంతాల ఆప్షన్‌లలో ఆమె పదో ఆప్షన్‌గా సిద్దిపేట ఇచ్చారు. జనగామ, మహబూబ్‌నగర్ జిల్లాల వారికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలు కేటాయించారు. ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలు తగినంతగా లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. దీంతో అభ్యర్ధులు తలలు పట్టుకుంటున్నారు.