Telangana Inter Exams: జూన్ నెలాఖరులో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు.? కుదరని పక్షంలో…. ప్రత్యామ్నాయ మార్గం..
Telangana Inter Second Year Exams: కరోనా కారణంగా విద్యా వ్యవస్థ మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా పరీక్షలు వాయిదా పడ్డాయి...
Telangana Inter Second Year Exams: కరోనా కారణంగా విద్యా వ్యవస్థ మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇక తెలంగాణలో పదో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు లేకుండా ప్రమోట్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీపరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే పరీక్షల నిర్వహణకు సంబంధించి ఆదివారం కేంద్ర మంత్రులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కేంద్రంతో పలు విషయాలను పంచుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కరోనా తీవ్రత తగ్గితే జూన్ నెలాఖరులో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. అవకాశం ఉంటే జూన్ నెలాఖరులో పరీక్షలు జరుపుతామని, లేని పక్షంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. ఒకవేళ రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు లేకుంటే ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇవ్వడం లాంటి వాటిని పరిశీలిస్తున్నామని వివరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో 9.50 లక్షల మంది ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.