Success story: ఒకప్పుడు SBI లో స్వీపర్.. నేడు అదే బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్..
కృషి పట్టుదల ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులు అవుతారని ఓ సిని కవి చెప్పాడు. ఇలాంటి మాటలను కొంతమంది ఆదర్శంగా తీసుకుని ఎటువంటి పరిస్థితులు ఏవైనా సరే.. తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలనే కోరికతో మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతారు. కష్టపడి పనిచేస్తే సాధించలేనిది ఏమీ ఉండదు అంటూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి స్త్రీ ప్రతీక్ష తోండ్వాల్కర్ గురించి ఈ రోజు తెలుసుకుందాం.. SBIలో స్వీపర్‌గా ఉద్యోగంలో చేరి.. నేడు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్టేజ్ కు చేరుకున్న స్పూర్తి దాయక కథ ఏమిటంటే

జీవితాన్ని గడపడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో స్వీపర్‌గా పని చేయడం నుంచి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) స్టేజ్ కు చేరుకున్నారు ప్రతీక్ష టోండ్‌వాల్కర్. ఈ స్టేజ్ కి చేరుకోవడానికి ఆమె కృషి, పట్టుదల దృఢ సంకల్పం ఉన్నాయి. ఆత్మవిశ్వాసం ఉంటే కష్టతరమైన పరిస్థితులను కూడా అధిగమించగలవని రుజువు చేశారు ప్రతీక్ష.
మహారాష్ట్రకి చెందిన ప్రతీక్ష తోండ్వాల్కర్ నిరు పేద కుటుంబంలో జన్మించారు. ప్రతీక్ష జీవితం సవాళ్లతో ప్రారంభమైంది. ప్రతీక్ష 10వ తరగతి చదువున్న సమయంలో ఇంట్లోని ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అప్పుడు ఆమె వయసు 17 ఏళ్ళు. సదాశివ్ అనే వ్యక్తితో పెళ్లి చేయడంతో ప్రతీక్ష చదువు మానేయాల్సి వచ్చింది. ఆమె భర్త సదాశివ్ కడు ముంబైలోని SBI కార్యాలయంలో బుక్‌బైండర్‌గా పనిచేసేవాడు. ఒక కొడుకు పుట్టిన తర్వాత ప్రతీక్ష జీవితంలో పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక ప్రమాదంలో భర్త సదాశివం మరణించాడు. అప్పుడు ఆమె వయసు కేవలం 20 ఏళ్ళు. సాఫీగా జీవితం సాగుతుందనుకున్న సమయంలో భర్త మరణంతో ఆమె విషాదం అలుముకుంది. చిన్న వయసులో భర్తని కోల్పోవడం.. ఒంటిగా పసి బిడ్డని పెంచాల్సిన అవసరం ఏర్పడింది.
తన కాళ్ళపై తను నిలడాలనుకుంది. ప్రతీక్ష మంచి ఉద్యోగం కోసం చాలా కష్టపడింది. అయితే సరైన చదువు లేకపోవడంతో భర్త పనిచేసిన SBI బ్యాంకులోనే నెలకు 60-65 రూపాయల జీతానికి స్వీపర్ గా చేరింది. ఆమె టాయిలెట్లు, ఫర్నిచర్ శుభ్రం చేస్తూ కొంచెం సంపాదనతోనే ఇంటిని గడుపుతూనే కొడుకుని పెంచుతూ భాద్యతలు ఒంటరిగా మోసింది. అయితే తన కొడుక్కి మంఛి భవిష్యత్ ఇవ్వాలంటే ఏదైనా చేయాలనీ భావించింది. అందుకు చదువు ఒకటే మార్గం అని తలచి ఆగిపోయిన చదువుని మళ్ళీ మొదలు పెట్టింది.
ఆశ వదులుకోని ప్రతీక్ష ముంబైలోని విఖ్రోలిలోని నైట్ కాలేజీలో చేరి.. తన చదువును తిరిగి ప్రారంభించింది. అలా 12వ తరగతి పరీక్షను పూర్తి చేసింది. తన జీవితాన్ని, కెరీర్‌ను మార్చాలని నిశ్చయించుకుని, సైకాలజీలో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. అంతటితో ఆగలేదు.. ఓ వైపు ఇంటి బాధ్యతలు, మరోవైపు బ్యాంకులో పని చదువు అన్నింటి సమన్వయం చేసుకుంటూ కష్టపడింది.. ప్రతీక్ష పడిన కష్టానికి గుర్తింపుగా స్వీపర్‌గా పనిచేస్తున్న ఆమెకు బ్యాంకులో క్లర్క్‌గా ప్రమోషన్ లభించింది.
1993లో ఆమె ప్రమోద్ టోండ్వాల్కర్‌ను రెండో వివాహం చేసుకుంది. అతను తన భార్య ఆకాంక్షలకు మద్దతు ఇచ్చాడు. బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధం అయ్యేలా ఆమెను ప్రోత్సహించాడు. అవిశ్రాంత కృషితో, ప్రతీక్ష త్వరలోనే ట్రైనీ ఆఫీసర్‌గా మారింది.. తర్వాత స్కేల్ I, స్కేల్ II, స్కేల్ III, స్కేల్ IV, ఛీఫ్ మేనేజర్ ఇలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రతీక్ష చివరకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) అనే అత్యున్నత పదవిని అలంకరించారు. ఒకప్పుడు ఏ బ్యాంకు ఆవరణలో చీపురు పట్టి తుడిచారో.. అదే బ్యాంక్ ఉద్యోగిగా నేడు వేలాది మంది ఉద్యోగులను నిర్దేశించే స్టేజ్ చేరుకుని నేటి తరం యువతీ యువకులకు స్పూర్తిగా నిలిచారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








