Constable Physical Events: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఈ నెలాఖర్నుంచి దేహదారుఢ్య పరీక్షలు షురూ

దాదాపు మూడేళ్లుగా ఎదురు చూస్తున్న కానిస్టేబల్ దేహదారుఢ్య పరీక్షలు ఎట్టకేలకు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ ముందుకొచ్చింది. ఈ మేరకు తాజాగా ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూల్ ను విడుదల చేసింది..

Constable Physical Events: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఈ నెలాఖర్నుంచి దేహదారుఢ్య పరీక్షలు షురూ
Constable Physical Events
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 13, 2024 | 5:34 PM

అమరావతి, డిసెంబర్‌ 13: ఆంధ్రప్రదేశ్‌ కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ ఎం రవిప్రకాశ్‌ ప్రకటించారు. ఉమ్మడి జిల్లాల్లోని అన్ని ప్రధాన కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. హాల్‌ టికెట్లు డిసెంబర్‌ 18 నుంచి 29 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని, వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అన్నారు. ఇందుకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే 94414 50639 లేదా 91002 03323 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి 2022 నవంబరు 28న నోటిఫికేషన్‌ విడుదలవగా.. గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. గతేడాది ఫిబ్రవరి 5న ప్రిలిమ్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. తదుపరి దశకు 95,209 మంది అభ్యర్ధులు ఎంపికవగా.. అప్పటినుంచి ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా ఫిజికల్‌ టెస్టుల కోసం సన్నద్ధమవుతున్నారు. దాదాపు మూడేళ్లగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ నానుతూనే ఉంది. అయితే పీఎంటీ, పీఈటీ నిర్వహణ తేదీలను కూటమి సర్కార్‌ విడుదల చేసి, షెడ్యూల్‌ కూడా ఖరారు చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.

కొత్త ఇంజినీరింగ్‌ సీట్లు వద్దన్న తెలంగాణ సర్కార్.. ఎందుకంటే?

తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఇంజినీరింగ్‌ సీట్లు వద్దని రాష్ట్ర ప్రభుత్వం అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)ని కోరనుంది. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ అంటే సీఎస్‌ఈ, ఐటీ అన్నట్లు పరిస్థితి మారిందని, 70 శాతం మంది ఆ కోర్సుల్లోనే చేరుతున్నారని పేర్కొంది. కోర్‌ బ్రాంచీలైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ తదితర బ్రాంచీలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీటీఈ ఆయా కళాశాలలకు అదనపు సీట్లు, మరిన్ని సెక్షన్లు మంజూరు చేసేముందే రాష్ట్ర అవసరాలు, డిమాండ్‌ తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకునేలా రాష్ట్ర దృక్కోణ ప్రణాళిక (పర్‌స్పెక్టివ్‌ ప్లాన్‌)ను రూపొందించి సమర్పించాలని నిర్ణయించింది. ఇంజినీరింగ్‌లో ఇప్పటికే 1.10 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్నేళ్లుగా నూరు శాతం భర్తీ కాకపోవడం వల్ల కొత్త సీట్లు అవసరం లేదన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలిసింది.కోర్‌ బ్రాంచీలను కాపాడుకోకుంటే భవిష్యత్తులో సమతుల్యత దెబ్బతింటుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే ఇంజినీరింగ్‌ కళాశాలలుగా మారుతున్న పాలిటెక్నిక్‌ కళాశాలల్లోనూ కోర్‌ బ్రాంచీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.