LIC Scholarship 2024: పేదింటి విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ 2024 మీ కోసమే! ఇలా దరఖాస్తు చేసుకోండి
పేదింటి విద్యా కుసుమాల చదువుకు ఆర్ధిక ఇబ్బందులు ప్రతిబంధకాలుగా నిలవకూడదనే ఉద్ధేశంతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) స్కాలర్ షిప్ అందిస్తోంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఎవరైనా ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు..
చదువుకోవలన్న తపన కలిగిన ఎందరికో పేదరికం అడ్డుగా నిలుస్తోంది. దీంతో ప్రతిభ ఉండి కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదువలేకపోతున్న ఎందరో యువత తమ కలలు సాకారం చేసుకునేందుకు తల్లడిల్లిపోతున్నారు. అటువంటి పేద విద్యార్థులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) గుడ్‌న్యూస్ చెప్పింది. గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీం-2024 పేరుతో ఉపకారవేతనాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. అర్హులైన విద్యార్థులు డిసెంబర్ 22, 2024వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరంలో కనీసం 60శాతం మార్కులతో లేదా తత్సమానమైన సీజీపీఏ గ్రేడ్‌తో ఉత్తీర్ణత పొందిన పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమో విద్యాను పూర్తి చేసిన విద్యార్ధులు ఈ స్కాలర్‌షిష్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
అలాగే 2024 -25లో ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందిన, పొందాలనుకునే బాల, బాలికలకు జనరల్ స్కాలర్‌షిప్‌లు అందించనుంది. మెడిసిన్, ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, ఏదైనా విభాగంలో డిప్లొమా చేయాలనుకుంటున్నా, గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో వొకేషన్ కోర్సులు, ఐటీఐ చదవాలనుకున్న వారికి ఈ పథకం ద్వారా స్కాలర్‌షిప్ అదించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
TGPSC వెబ్‌సైట్‌లో అందుబాటులో గ్రూప్ 2 హాల్‌టికెట్లు.. డౌన్‌లోడ్ లింక్ ఇదే
తెలంగాణ రాష్ట్రంలో 783 గ్రూప్ 2 సర్వీసు పోస్టులకు మరో వారంలో జరగనున్న పరీక్షల హాల్ టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అధికారిక వెబ్‌సైట్‌లోకి తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు టీజీపీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్ 2 పరీక్ష డిసెంబరు 15, 16 తేదీల్లో జరగనుంది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని, ఉదయం నిర్వహించే పరీక్షకు 9.30 గంటలు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 గంటల తరువాత అభ్యర్థులెవరినీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ ఇ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు.