JoSAA Counselling 2025: విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఐఐటీ సీట్లు పెరిగాయోచ్! మొత్తం ఎన్ని ఉన్నాయంటే..
2025-26 విద్యాసంవత్సరానికి బీటెక్, బీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జోసా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు మంగళవారం (జూన్ 3) సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో అందరి దృష్టి ఐఐటీ సీట్లపై నిలిచింది. గతేడాది మొత్తం 17,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా..

హైదరాబాద్, జూన్ 3: దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి బీటెక్, బీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జోసా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు మంగళవారం (జూన్ 3) సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో అందరి దృష్టి ఐఐటీ సీట్లపై నిలిచింది. గతేడాది మొత్తం 17,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా 420 సీట్లు పెరిగాయి. ఈసారి కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లోనూ సీట్లు పెరిగాయి. దీంతో ఈసారి మొత్తం 127 విద్యా సంస్థల్లో ఏకంగా 62,853 సీట్లను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో ఐఐటీ సీట్లు 18,160 వరకు ఉన్నాయి. ఇక ఎన్‌ఐటీల్లో 24,525 సీట్లు, ట్రీపుల్ ఐటీల్లో 9,940 సీట్లు, జీఎఫ్‌టీఐల్లో 10,228 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఐఐటీ హైదరాబాద్‌లో గతేడాది 595 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈసారి మరో 35 సీట్లు పెరిగాయి. దీంతో ఐఐటీ హైదరాబాద్‌లో సీట్ల సంఖ్య 630కి చేరాయి. గతేడాది 10 సీట్లతో నాలుగేళ్ల ఇంజినీరింగ్ ఫిజిక్స్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈసారి ఆ సీట్లను 35కి పెంచారు. మిగిలిన 10 సీట్లు ఇతర కోర్సుల్లో పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3424 ఐఐటీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా ఎన్‌ఐటీ వరంగల్‌లో 1049 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
కేటగిరీ వారీగా చూస్తే..
- ఓపెన్: 7364
- ఈడబ్ల్యూఎస్: 1814
- ఎస్సీ: 2724
- ఎస్టీ: 1364
- ఓబీసీ: 4894
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.








