ఇంటి కిటికీలో నుంచి రూ.500 నోట్ల వర్షం.. చీఫ్ రోడ్డు ఇంజనీర్ అరెస్ట్! ఏం జరిగిందంటే..
ప్రభుత్వ కొలువు వెలగబెడుతున్న మరో అవినీతి జలగ విజిలెన్స్ అధికారుల వలకు పట్టుబడింది. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న అనుమానంతో జరిపిన ఆకస్మిక దాడిలో ఊహించని విధంగా ఏకంగా రూ.2 కోట్లు బయటపడ్డాయి. లెక్కకు మించి ఆస్తి పత్రాలు సైతం బయటపడ్డాయి. రైడ్ భయంతో సదరు అధికారి రూ.500 నోట్ల కట్టలు తన ఇంటి కిటికీలో నుంచి బయటకు విసరడంతో వీధిలో నోట్ల వర్షం కురిసింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సదరు వ్యక్తి ఇంటితోపాటు సిటీలోని మరో ఏడు చోట్ల ఏక కాలంలో ఈ దాడులు జరిపారు. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌లో శుక్రవారం (మే 30) ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

భువనేశ్వర్, మే 30: ఒడిశాలోని భువనేశ్వర్‌లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో రోడ్ ప్లాన్ చీఫ్ ఇంజనీర్‌గా బైకుంత నాథ్ సారంగి అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు చెందిన 7 ప్రాంతాలపై శుక్రవారం (మే 30) విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో అతడి నివాసం నుంచి రూ.2 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అవినీతి, అక్రమ ఆస్తుల కేసులో ప్రభుత్వం జరిపిన ఈ దాడిలో లెక్కకు మించి ఆస్తులు బయటపడ్డాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
ఒడిశాలోని అంగుల్, భువనేశ్వర్, పిపిలి (పూరి) లోని ఏడు ప్రదేశాలలో ఏకకాలంలో జరిపిన దాడుల్లో విజిలెన్స్ విభాగం దాదాపు రూ.2.1 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. సారంగికి చెందిన ఆ ఏడు ప్రదేశాలు ఇవే.. అంగుల్‌లోని కరడగాడియాలో రెండంతస్తులో ఉన్న నివాస ఇల్లు, భువనేశ్వర్‌లోని దుండుమాలో ఒక ఫ్లాట్, పూరీలో మరో ఫ్లాట్, అంగుల్‌లోని శిక్షకపదలో సారంగి బంధువు ఇల్లు, అంగుల్‌లో అతడి తండ్రి ఇల్లు, అంగుల్‌లో రెండంతస్తుల తండ్రి భవనం, కార్యాలయ గది.. ఈ ఏడు ప్రదేశాల్లో ఏక కాలంలో దాడులు జరిగాయి. అయితే ముందే విషయం తెలుసుకున్న సారంగి.. విజిలెన్స్ అధికారులు వచ్చేసరికి తన ఫ్లాట్ కిటికీలోంచి రూ.500 నగదు కట్టలను వీధిలోకి విసిరి పారవేసేందుకు ప్రయత్నించాడు.

Odisha Vigilance Raid
అనంతరం సాక్షుల సమక్షంలో ఆ నోట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంగుల్‌లోని సారంగి నివాసంలో రూ.1.1 కోట్లు, భువనేశ్వర్ ఫ్లాట్‌లో మరో కోటి రూపాయలు దొరికాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. ఎనిమిది మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSPలు), 12 మంది ఇన్స్పెక్టర్లు, ఆరుగురు అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్లు (ASI) సహా 26 మంది పోలీసు అధికారుల బృందం ఈ సోదాలు నిర్వహించింది. సారంగి నివాసంలో లభ్యమైన నగదు కట్టలను లెక్కిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఎక్కువగా రూ. 500 నోట్ల కట్టలు, కొన్ని రూ. 200, రూ.100, రూ. 50 నోట్ల కట్టలు కూడా ఈ అవినీతి అధికారి ఇంట దొరికినట్లు అధికారులు తెలిపారు. నగదు లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




