AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiration Story: చిన్నతనంలోనే దూరమైన చూపు.. తల్లి కళ్లతో యూపీఎస్సీలో సత్తా చాటిన ఓ కుర్రాడి కథ!

విధి ఆడిన వింత నాటకంలో చిన్నతనంలోనే చూపు కోల్పోయాడు ఆ అబ్బాయి. ఆ తర్వాత తండ్రి దూరమయ్యాడు. అయినా ఇవేమీ నీకు అడ్డుకాదని అతడికి జన్మ ఇచ్చిన తల్లి భుజం తట్టి ధైర్యం చెప్పింది. సివిల్స్‌ చదువుతానని కొడుకు కోరితే.. అది ఖర్చుతో కూడుకున్న పని మనకెందుకులే అని ఆమె నిరుత్సాహ పరచలేదు. తన కళ్లనే కొడుక్కి దీపాలుగా మార్చి..

Inspiration Story: చిన్నతనంలోనే దూరమైన చూపు.. తల్లి కళ్లతో యూపీఎస్సీలో సత్తా చాటిన ఓ కుర్రాడి కథ!
UPSC CSE 2024 Topper Manu Garg
Srilakshmi C
|

Updated on: May 28, 2025 | 1:08 PM

Share

ఒంట్లో అన్నీ పార్ట్‌లు చక్కగా ఉండి, తల్లిదండ్రులు సకల సౌకర్యాలు సమకూర్చినా పట్టుమని నాలుగు గంటలు కూడా కదలకుండా కూర్చుని చదవలేరు నేటి యువత. కానీ ఓ అబ్బాయి అలాకాదు.. విధి ఆడిన వింత నాటకంలో చూపు కోల్పోయాడు. ఆ తర్వాత తండ్రి దూరమయ్యాడు. అయినా ఇవేమీ నీకు అడ్డుకాదని అతడికి జన్మ ఇచ్చిన తల్లి భుజం తట్టి ధైర్యం చెప్పింది. సివిల్స్‌ చదువుతానని కొడుకు కోరితే.. అది ఖర్చుతో కూడుకున్న పని మనకెందుకులే అని ఆమె నిరుత్సాహ పరచలేదు. తన కళ్లనే కొడుక్కి దీపాలుగా మార్చి అహోరాత్రులు శ్రమించి కొడుకు విజయానికి వెన్నెముకైంది. ఫలితంగా కుమారుడు ఊహించని రీతిలో ఆల్‌ ఇండియా స్థాయిలో యూపీఎస్సీ ఫలితాల్లో 91వ ర్యాంకు సాధించాడు. అతడే జైపూర్‌కి చెందిన మను గార్గ్ (23). ఆ తల్లీ కొడుకుల విజయగాథలోకి వెళ్తే..

జైపుర్‌కి చెందిన మను గార్గ్‌కి చిన్నతనం నుంచే కాస్త దృష్టిలోపం ఉండేది. అయినా అదేమీ నీకు అడ్డుకాదంటూ కొడుకు చదువును ప్రోత్సహించింది తల్లి వందన. తీరా మను ఎనిమిదో తరగతికొచ్చేసరికి చూపు పూర్తిగా కనిపించడం మానేసింది. దీంతో కుమారుడు భయపడకుండా తల్లి వందన ధైర్యం చెప్పింది.నేనే నీ కళ్లు అంటూ ప్రోత్సహించింది. పుస్తకాలు, కథలు, వార్తలు ప్రతిదీ పెద్ద గొంతుకకతో కొడుక్కి చదివి వినిపించేది. పాఠ్యాంశాలు కూడా అంతే.. మనూ తిరిగి నేర్చుకునేవారకూ ఓపికగా చదివేవారు. ఏ ఊళ్లో, ఏ కళాశాలలో చదివినా వెంట వెళ్లి కొడుకును చదివించుకుంది.

అలా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో మనూ సెకండ్ ర్యాంకు సాధించాడు. విద్యావేత్తలను మించి అద్భుతమైన డిబేటర్‌గా 150కిపైగా పోటీల్లో సత్తా చాటాడు. కోవిడ్‌ సమయంలో యూపీఎస్సీ సివిల్స్‌కి ప్రిపరేషన్‌ ప్రారంభించాడు. అయితే అందుబాటులో ఉన్న మెటీరియల్ కొరత వల్ల తొలి ప్రయత్నం విఫలమైంది. అప్పుడు కొడుకు నిరాశపడితే తల్లి వందన తిరిగి ఉత్సాహ పరిచింది. ఈసారి మనూ ప్రిపరేషన్‌ ప్లాన్‌ని మార్చి.. టెక్నాలజీ సాయంతో, కొండంత అమ్మ అండతో మళ్లీ చదవడం ప్రారంభించాడు. ప్రిపరేషన్‌ టైంలో ఫోన్‌లోని టాక్‌బ్యాక్ ఫీచర్‌ను ఉపయోగించి, పదే పదే కంటెంట్‌ను వింటూ, ఆడియో లెర్నింగ్ ద్వారా సబ్జెక్టుపై పట్టు సాధించానని, తల్లి వందన ఆడియో నోట్స్‌ను ఎప్పటి కప్పుడు సవరించడం, ఏదీ మిస్‌ కాకుండా చూసుకోవడంలో చాలా ఓపికగా కీలక పాత్ర పోషించింది. అయితే ఈసారి విజయం వరించింది.

ఇవి కూడా చదవండి

అఖిల భారత స్థాయిలో ఏకంగా 91వ ర్యాంకు సాధించాడు మను. తన విజయం అమ్మపెట్టిన భిక్ష అంటూ భావోధ్వేగానికి గురయ్యాడు. ప్రిపరేషన్‌లో ప్రతి అంశం అర్థమయ్యేదాకా అమ్మ ఓపికగా మళ్లీ మళ్లీ చదివి వినిపించేదని, అవసరమైన సూచనలూ చేసేదని మనూ గర్వంగా తెలిపాడు. అందుకే నా విజయంలో సగానికిపైగా వాటా తనదే అంటూ ఆనందం వ్యక్తం చేశారు. అడ్డంకులకు లొంగని సంకల్పంతో మను సాధించిన ఈ విజయం ప్రతి ఒక్కరికీ ఓ ఆదర్శం..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.