విద్యాశాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ట! టెన్త్ ఫలితాల్లో ఫెయిల్.. రీవాల్యుయేషన్‌లో మాత్రం షాకింగ్ సీన్..
రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్ధుల జీవితాలతో అధికారులు చలగాటం ఆడుతున్నారు. పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం అస్తవ్యస్తంగా జరిగిందనడానికి తాజాగా వెలుగు చూసిన రెండు సంఘటనలు అద్దంపడుతున్నాయి. స్కూల్ టాపర్ అయిన ఓ విద్యార్ధినికి అన్ని సబ్జెక్టుల్లో 90కిపైగా మార్కులు వచ్చాయి. కానీ ఓ సబ్జెక్టులో మాత్రం కనీసం పాస్ మార్కులు కూడా రాలేదు.. ఆరా తీయగా..

జమ్మలమడుగు, మే 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్ధుల జీవితాలతో అధికారులు చలగాటం ఆడుతున్నారు. పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం అస్తవ్యస్తంగా జరిగిందనడానికి తాజాగా వెలుగు చూసిన రెండు సంఘటనలు అద్దంపడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఐదు సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులు తెచ్చుకున్న ఈమని తేజస్వి అనే విద్యార్థిని.. సోషల్ సబ్జెక్టులో కనీసం పాస్ మార్కులు కూడా లేకపోవడంతో ఫెయిల్ అయింది. దీంతో ఆ విద్యార్ధిని స్కూల్ ఉపాధ్యాయులకు తెలపడంతో పునఃమూల్యాంకనంకి దరఖాస్తు చేశారు. తాజాగా రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలు వెల్లడికాగా.. అందులో సదరు విద్యార్ధినికి సోషల్ సబ్జెక్టులో ఏకంగా 100కు 96 మార్కులు వచ్చాయి. మూల్యాంకనం సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా టాప్ మార్కులు వచ్చిన విద్యార్ధినికి ఇలా తప్పుడు మార్కులు వేశారు. బాపట్ల జిల్లా కొల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన ఈ బాలిక విషయంతో ఇంత పెద్ద తప్పిదం జరిగింది. మరోవైపు ఇలాంటి ఘటనే వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లలోనూ వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..
వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన గంగిరెడ్డి మోక్షిత అనే మరో విద్యార్ధిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివింది. ఈ ఏడాది జరిగిన పబ్లిక్ పరీక్షలు కూడా రాసింది. ఏప్రిల్‌లో వెలువడిన పదో తరగతి ఫలితాల్లో మోక్షిత సోషల్ సబ్జెక్టులో ఫెయిల్ అయినట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. అయితే మిగతా సబ్జెట్లుల్లో మాత్రం అన్నీ టాప్ మార్కులు వచ్చాయి. తెలుగులో 96, హిందీలో 82, ఇంగ్లిషులో 84, గణితంలో 93, సైన్స్‌లో 98 మార్కులు వచ్చాయి. అయితే సోషల్ సబ్జెక్టులో మాత్రం కేవలం మాత్రం 21 మార్కులే వచ్చినట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు జారీ చేసిన మార్కుల లిస్టులో వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన మోక్షిత తండ్రి గంగిరెడ్డి మల్లేశ్వరరెడ్డి రూ.1000 ఫీజు కట్టి రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేశారు. ఈసారి మోక్షిత జవాబుపత్రం రీవాల్యూయేషన్ చేయగా ఏకంగా 84 మార్కులు వచ్చాయి. ఈ మేరకు ఫలితాలతోపాటు జవాబు పత్రం కూడా అధికారులు పంపారు. అంటే 84 మార్కులు వస్తే నిర్లక్ష్యంగా మూల్యాంకనం చేసి ఏకంగా 63 మార్కులు తగ్గించారు. మొత్తం ఆరు సబ్జెక్టుల్లో కలిపి మోక్షితకు 537 మార్కులు వచ్చాయి.
అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ట్రిపుల్ ఐటీ, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీల్లో అడ్మిషన్లు దరఖాస్తు గడువులు ముగిశాయి. విద్యార్ధినికి వచ్చిన మార్కులతో ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది. వాల్యూయేషన్ సమయంలో అధికారుల తప్పిదం వల్ల ఇప్పుడు మోక్షిత అవకాశం కోల్పోయినట్లైంది. దీంతో విద్యార్థిని మోక్షిత తండ్రి ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ తన కూతురికి న్యాయం చేయాలని కోరారు. వాల్యూయేషన్ చేసిన అధికారులు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, ఏపీ రెసిడెన్షియల్, గురుకుల, ట్రిపుల్ ఐటీల్లో దరఖాస్తు చేసుకునేందుకు తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని కోరారు. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకోకుండా ఇలాంటి సంఘటనలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




