AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Mega DSC 2025 Exam: మెగా డీఎస్సీ నిలిపివేతకు హైకోర్టు నో.. అనుబంధ పిటిషన్లు కొట్టివేత!

జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభంకానున్న డీఎస్సీ రాత పరీక్షలను నిలిపి వేయాలని స్టే కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు సోమవారం విచారించింది. డీఎస్సీ పరీక్ష నిలిపివేతకు సహేతుకమైన కారణాలు సమర్పించనందున స్టే విధించలేమని కోర్టు తేల్చి చెప్పింది. పైగా డీఎస్సీ పరీక్షలను నిర్వహించే ప్రక్రియ తుది దశకు చేరుకుందని, ఈ నేపథ్యంలో స్టే..

AP Mega DSC 2025 Exam: మెగా డీఎస్సీ నిలిపివేతకు హైకోర్టు నో.. అనుబంధ పిటిషన్లు కొట్టివేత!
High Court
Srilakshmi C
|

Updated on: Jun 03, 2025 | 3:14 PM

Share

అమరావతి, జూన్‌ 3: ఆంధ్రప్రదేశ్‌ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌పై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లను ధర్మాసనం కొట్టివేసింది. జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభంకానున్న డీఎస్సీ రాత పరీక్షలను నిలిపి వేయాలని స్టే కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు సోమవారం విచారించింది. డీఎస్సీ పరీక్ష నిలిపివేతకు సహేతుకమైన కారణాలు సమర్పించనందున స్టే విధించలేమని కోర్టు తేల్చి చెప్పింది. పైగా డీఎస్సీ పరీక్షలను నిర్వహించే ప్రక్రియ తుది దశకు చేరుకుందని, ఈ నేపథ్యంలో స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా జారీ చేయడం జరిగిందని, పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పడంతో.. ఈ దశలో విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పరీక్షలను నిలిపివేయడం సరికాదని చెప్పింది. ఉద్యోగాల భర్తీ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని స్పష్టం చేసింది. హౌజ్‌మోషన్లో దాఖలైన వ్యాజ్యాలపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

2011లో ప్రభుత్వం జారీచేసిన జీవో 51 ప్రకారం ఏడాదికి రెండుసార్లు టెట్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే నిబంధనలకు భిన్నంగా ఒక్కసారి మాత్రమే టెట్‌ పరీక్ష నిర్వహించినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు. రెండోసారి టెట్‌ పరీక్ష నిర్వహించకుండానే డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ జారీచేయడం చట్ట విరుద్ధమంటూ చిత్తూరు జిల్లాకు చెందిన పిప్రభాకర్‌తోపాటు మరికొందరు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అలాగూ 2024 ఫిబ్రవరి 12న జారీచేసిన ఏపీ డీఎస్సీ 2024కి తాము వయసు పరంగా అర్హత సాధించామని, కూటమి సర్కార్‌ దానిని రద్దు చేయడంతో అధిక వయసు కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌ 20న జారీచేసిన నోటిఫికేషన్‌కు అనర్హులమైనట్లు మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. డీఎస్సీ 2024కు అర్హులైన వారంతా ప్రస్తుత డీఎస్సీకి అర్హులుగా ప్రకటించాలని వారు కోరారు.

సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రకారం టెన్త్‌లో ఫస్ట్‌ లాంగ్వేజ్‌ ఇంగ్లిష్‌, సెకండ్‌ లాంగ్వేజ్‌ తెలుగు చదివిన వారికి డీఎస్సీ 2025లో అవకాశం ఇవ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ ఎమ్మిగనూరుకు చెందిన వెలికంటి సాంబశివ మరో వ్యాజ్యం వేశారు. అలాగే బీఈడీ చివరి సంవత్సరం చదువుతున్న వారిని డీఎస్సీ నుంచి మినహాయించడంపై, మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు 90 రోజుల గడువు ఇవ్వకపోవడం వంటి అంశాలపై పిటిషన్లు దాఖలైనాయి. వీటికి పాఠశాల విద్యాశాఖ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌.ప్రణతి వాదనలు వినిస్తూ.. వయో పరిమితిని పెంచాలని కోరుతున్న వారికి 2024 డీఎస్సీ నాటికే అర్హత లేదన్నారు. నిర్ధిష్ట పోస్టులకు తప్ప.. మిగిలిన పోస్టులకు సీబీఎస్‌ఈలో ఫస్ట్ లాంగ్వేజ్‌గా ఇంగ్లిష్‌ చదివినవారు అర్హులేనన్నారు. ఇప్పటికే హాల్‌ టికెట్లు జారీ చేశామని, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని.. ఈ దశలో పరీక్షలను వాయిదా వేయడం సరికాదని, ఆ పిటిషన్లను కొట్టేయాలని కోర్టును కోరారు. ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి అనుబంధ పిటిషన్లను కొట్టేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.