JNVST 6th Class 2026: పేదింటి బిడ్డలకు పెద్ద చదువులు.. నవోదయలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
JNVST 6th Class Admissions 2026: దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 654 నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణ 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో ప్రవేశాలకు మొత్తం రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్టు..

జవహర్ నవోదయ విద్యాలయ సమితి 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 654 నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణ 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో ప్రవేశాలకు మొత్తం రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 15, 2025 నుంచి అందుబాటులోకి రానుంది. జూన్ 15 నుంచి జులై 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి చదువుతున్న గ్రామీణ నేపథ్యమున్న విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే విద్యార్ధులు తప్పనిసరిగా మే 1, 2014 నుంచి ఏప్రిల్ 30, 2016 మధ్య జన్మించి ఉండాలి. ఈ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. తొలి దశ తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ 13 (శనివారం)న ఉదయం 11.30 గంటలకు జరుగుతుంది. జమ్మూ కశ్మీర్ సహా పలు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో 2026 ఏప్రిల్ 11న రెండో దశ పరీక్ష జరుగుతుంది. ఈ మేరకు నవోదయ విద్యాలయ సంస్థ ప్రవేశ పరీక్ష వివరాలను నోటిఫికేషన్‌లో పేర్కొంది. వీటి ఫలితాలు వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానున్నాయి.
ఆసక్తి కలిగిన వారు navodaya.gov.in లేదా cbseitms.rcil.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
రాత పరీక్ష విధానం ఇదే..
నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష తెలుగుతో సహా పలు ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. 80 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 2 గంటల పాటు పరీక్ష జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలు, అర్థమెటిక్ నుంచి 20 ప్రశ్నలు, లాంగ్వేజ్ టెస్ట్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




