JEE Advanced 2024 Admit Card: మరో రెండు రోజుల్లో జేఈఈ అడ్వాన్స్ అడ్మిట్ కార్డులు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష అడ్మిట్ కార్డులు మే17వ తేదీన విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 26వ తేదీన ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. ఉదయం షిఫ్ట్‌లో పేపర్-1 పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు..
న్యూఢిల్లీ, మే 15: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష అడ్మిట్ కార్డులు మే17వ తేదీన విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 26వ తేదీన ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. ఉదయం షిఫ్ట్‌లో పేపర్-1 పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్ట్‌లో పేపర్-2 పరీక్ష 2.30 నుంచి 5.30 గంటల వరకు జరగనుంది. మొత్తం రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్ష జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మకమైన 23 ఐఐటీల్లో, ఇతర ప్రఖ్యాత సంస్థల్లో బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
కాగా ఈ ఏడాది రెండు విడతల్లో నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 2.5 లక్షల మందిని మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అనుమతిస్తారు. పరీక్ష అనంతరం ప్రిలిమినరీ ఆన్సర్ కీ జూన్ 2న వెల్లడిస్తారు. కీపై అభ్యంతరాల నమోదు జూన్ 2 నుంచి జూన్ 3 వరకు స్వీకరిస్తారు. ఫైనల్ ఆన్సర్ కీతోపాటు జేఈఈ ఆడ్వాన్స్ తుది ఫలితాలను జూన్ 9వ తేదీన విడుదల అవుతాయి.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా ఉత్తీర్ణులైన వారు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ-2024) రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఏఏటీ-2024 పరీక్ష జూన్ 12వ తేదీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఐఐటీల్లోని బీఆర్క్ కోర్సుల్లో చేరేందుకు ఈ పరీక్షలో ర్యాంకులు సాధించవల్సి ఉంటుంది. ఏఏటీ ఫలితాలు జూన్ 15న వెల్లడిస్తారు. జూన్ 10 సాయంత్రం 5 గంటల నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.