Andhra Pradesh: ‘ఓటేశాం.. ఇక వెళ్లొస్తాం!’ సొంతూరు నుంచి పట్నానికి బయల్దేరిన ఆంధ్రా జనం
ఓట్ల పండక్కి సొంత ఊరికి వచ్చిన ప్రజలు అదే రోజు సాయంత్రానికి తిరిగి పట్నం బాటపట్టారు. కార్లు, బస్సులు, లారీలు ఏ వాహనం దొరికితే అది పట్టుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు. దీంతో హైదరాబాద్ వైపు వచ్చే రహదారుల్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్‌గేట్ వద్ద సాధారణంగా రోజుకు 20 వేలకు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్తుంటాయి. అయితే సోమవారం మాత్రం..
అమరావతి, మే 14: ఓట్ల పండక్కి సొంత ఊరికి వచ్చిన ప్రజలు అదే రోజు సాయంత్రానికి తిరిగి పట్నం బాటపట్టారు. కార్లు, బస్సులు, లారీలు ఏ వాహనం దొరికితే అది పట్టుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు. దీంతో హైదరాబాద్ వైపు వచ్చే రహదారుల్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్‌గేట్ వద్ద సాధారణంగా రోజుకు 20 వేలకు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్తుంటాయి. అయితే సోమవారం మాత్రం సాయంత్రం 6.30 గంటలకే వీటి సంఖ్య 35 వేలకు పైగా పెరిగింది. మిగిలిన రహదారుల్లోనూ ఇదే పరిస్థితి. రద్దీ అంతకంతకు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిటీ నుంచి సుమారు 6 లక్షల మంది ఆంధ్రాకు చేరుకున్నట్లు అంచనా. ఇది ప్రతీయేట సంక్రాంతి సమయంలో ఉండే రద్దీతోపోల్చితే మరింత ఎక్కువేనంటున్నారు అధికారులు.
మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ దేశాల నుంచీ కూడా ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున ఏపీకి తరలివచ్చారు. మరికొందరైతే 3, 4 నెలలు ముందుగానే సొంతూరుకి చేరుకుని, ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్నారు. కొన్ని చోట్ల సోమవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరలు బారులు తీరి ఓటేశారు. వీరిలో అధికశాతం మంది సోమవారం సాయంత్రానికే తిరుగు ప్రయాణమయ్యారు.
42 బస్సుల్లో కదలి వచ్చిన యువత
తమ ప్రియతమ నేతను ఎన్నుకోవాలన్న దృఢ సంకల్పంతో ఐటీ ఉద్యోగులు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన యువత పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరంతా సోమవారం సొంత ఖర్చులతో 42 బస్సుల్లో వచ్చారు. మలికిపురంలో దిగి.. అక్కడి నుంచి వ్యక్తిగత వాహనాల్లో సొంత ఊళ్లకు వెళ్లిమరీ ఓటేశారు. వీరిలో కొత్తగా ఓటుహక్కు వచ్చిన వారే అధికంగా ఉండటం విశేషం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.