JNV 6th Class Admissions: నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు ముగుస్తోన్న గడువు.. ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడంటే
దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయ(JNV)లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మరో వారంలో ముగియనుంది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సెప్టెంబర్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించింది. దేశ వ్యాప్తంగా ఉన్న 653 నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు..
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయ(JNV)లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మరో వారంలో ముగియనుంది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సెప్టెంబర్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించింది. దేశ వ్యాప్తంగా ఉన్న 653 నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఆరో తరగతిలో అడ్మిషన్లు ఉంటాయి. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యతోపాటు వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. బాలబాలికలకు వేర్వేరు వసతి సౌకర్యాలు కల్పించారు.
2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతూ ఉన్న విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మే 1, 2013 నుంచి జులై 31, 2015 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ రెండు సెషన్ల చొప్పున జరుగుతుంది. ఏప్రిల్ 12, 2025 ఉదయం 11 గంటలకు ఒక సెషన్ పరీక్ష జరుగుతుంది. మిగిలిన విద్యార్ధులకు జనవరి 18, 2025వ తేదీ ఉదయం 11.30 గంటలకు రెండో సెషన్ పరీక్ష జరుగుతుంది. రాత పరీక్ష స్థానిక భాషల్లో కూడా రాయవచ్చు. తెలుగుతో సహా ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ, బోడో, బెంగాళీ, అస్సామీ, పంజాబీ వంటి అన్ని స్థానిక భాషల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మార్చి నెలలో ఫలితాలు విడుదల చేస్తారు.
ఏపీపీఎస్సీ ఉద్యోగుల పరీక్షల ఫలితాల వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఉద్యోగులకు నిర్వహించిన శాఖాపరమైన పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కో-ఛైర్మన్‌గా మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యులుగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిని ప్రభుత్వం నియమించింది. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని అంశాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కమిటీని సర్కార్ అదేశించింది.