CRPF కోబ్రా యూనిట్‌కు IGగా IPS సంజుక్తా పరాశర్.. ‘అస్సాం ఐరన్ లేడీ’కి కీలక బాధ్యతలు
సీఆర్పీఎఫ్ కోబ్రా (CoBRA) యూనిట్‌కు ఐజీగా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి సంజుక్తా పరాశర్ నియమితులయ్యారు. ఈ ప్రత్యేక కమాండో విభాగానికి నాయకత్వం వహిస్తున్న తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అస్సాం-మేఘాలయ క్యాడర్‌కు చెందిన సంజుక్తా పరాశర్ గతంలో అస్సాంలో, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)లో కీలక బాధ్యతలు నిర్వహించారు. దట్టమైన అడవుల్లో క్లిష్టమైన ఆపరేషన్లను నిర్వహించిన అనుభవంతో ఆమెకు ‘ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం’గా గుర్తింపు ఉంది..

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లోని ప్రత్యేక కమాండో విభాగం కోబ్రా (CoBRA) యూనిట్‌కు ఐజీగా ఐపీఎస్ అధికారిణి సంజుక్తా పరాశర్ నియమితులయ్యారు. ఈ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళా అధికారిణిగా ఆమె కొత్త చరిత్ర సృష్టించారు. అస్సాం-మేఘాలయ క్యాడర్‌కు చెందిన సంజుక్తా పరాశర్ 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి. ఇప్పటివరకు కోబ్రా యూనిట్‌కు ఐజీగా ఉన్న 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి దనేష్ రాణా స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. అస్సాంకు చెందిన సంజుక్తా పరాశర్ తన స్వరాష్ట్రంలో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. అనంతరం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)లోనూ సేవలందించారు. అస్సాంలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో పనిచేస్తూ అనేక క్లిష్టమైన ఆపరేషన్లలో పాల్గొన్న ఆమెకు ‘ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం’ అనే పేరు వచ్చింది. సవాళ్లతో కూడిన భద్రతా పరిస్థితుల్లో విధులు నిర్వహించిన అనుభవం ఆమెకు ఉంది. సంజుక్తా పరాశర్ దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU)లో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా 85వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.
ఏంటి కోబ్రా యూనిట్?
మావోయిస్టులు, ఈశాన్య రాష్ట్రాల్లోని సాయుధ తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు సీఆర్పీఎఫ్‌లో కోబ్రా (Commando Battalion for Resolute Action) యూనిట్‌ను 2008లో ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా అడవుల్లో జరిగే ఆపరేషన్ల కోసం శిక్షణ పొందిన కోబ్రా కమాండోలు జంగిల్ వార్‌ఫేర్, గెరిల్లా ఆపరేషన్లలో నైపుణ్యం కలిగి ఉంటారు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో భద్రతా ఆపరేషన్లు నిర్వహించడం ఈ యూనిట్ ప్రధాన బాధ్యతల్లో ఒకటి. మణిపుర్‌లో సాయుధ హింసను అరికట్టేందుకు సీఆర్పీఎఫ్ ఇటీవల రెండు కోబ్రా యూనిట్లను మోహరించింది. ఇలాంటి సున్నితమైన భద్రతా పరిస్థితుల నేపథ్యంలో కోబ్రా యూనిట్‌కు సంజుక్తా పరాశర్ నాయకత్వం వహించనున్నారు.
కఠినమైన ఆపరేషన్లలో అనుభవం ఉన్న అధికారిణిగా గుర్తింపు పొందిన సంజుక్తా పరాశర్‌కు కోబ్రా ఐజీగా కొత్త బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్రత్యేక కమాండో విభాగానికి తొలిసారిగా ఓ మహిళా అధికారిణి నాయకత్వం వహించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.




