TGPSC Group 1 Mains: ‘టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ వాయిదా వేయాల్సిందే’ అభ్యర్ధుల ఆందోళన

ఓవైపు తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు వడివడిగా సాగుతుంటే.. మరోవైపు ఈ పరీక్షలు వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో పెద్ద ఎత్తున అభ్యర్ధులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపట్టడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు..

TGPSC Group 1 Mains: 'టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ వాయిదా వేయాల్సిందే' అభ్యర్ధుల ఆందోళన
Protest In Ashoknagar
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 17, 2024 | 2:40 PM

హైదరాబాద్, అక్టోబర్‌ 17: తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు బుధవారం (అక్టోబరు 16) రాత్రి హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఆందోళన చేపట్టారు. అక్టోబర్‌ 21 నుంచి జరగనున్న మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని, అలాగే గతంలో జరిగిన ప్రిలిమ్స్‌లో తప్పులనూ సవరించాలని డిమాండ్‌ చేశారు. జీవో నం.29ను రద్దు చేసిన తర్వాతే పరీక్షలను నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఆందోళన చేపట్టిన అభ్యర్థులంతా ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకు రావడంతో.. స్థానికంగా వాహన దారులకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్డుపై రద్దీ పెరిగి ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అభ్యర్థులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించి, ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

హైదరాబాద్‌లో 8 పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్‌: కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

ఇదిలా ఉంటే.. మరోవైపు టీజీపీఎస్సీ షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 21వ తేదీ నుంచి గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే హాల్‌ టికెట్లను కూడా విడుదల చేసింది. గ్రూప్‌ 1 మెయిన్స్‌ హైదరాబాద్‌ పరిదిలో జరగనుండటంతో పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది. హైదరాబాద్‌ జిల్లాలో 5613 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, అందుకు ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలిపారు. అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు జరుగుతాయని, మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్ధులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఆయా తేదీల్లో అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారని, మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత గేట్లు మూసి వేస్తారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

గ్రూప్‌ 1 మెయిన్స్‌కు హాజరయ్యే అభ్యర్ధులు ఏదైనా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డును మాత్రమే పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టంగా ఉంటేనే హాల్‌టికెట్‌ చెల్లుబాటు అవుతుందన్నారు. డౌన్‌లోడ్‌ చేసిన హాల్‌ టికెట్‌లో ఫొటో అస్పష్టంగా ఉంటే.. అటువంటి వారు మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలను గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరించిన అండర్‌టేకింగ్‌తో పాటు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉన్న ఫార్మాట్‌ను తీసుకురావాలని సూచించారు. గ్రూప్‌ 1 మెయిన్స్‌కు ఆన్‌లైన్‌ ఆప్లికేషన్‌లో ఎంచుకున్న భాషలోనే మెయిన్స్‌ పరీక్షలన్నింటినీ రాయాలన్నారు. ఎంచుకున్న భాషలో కాకుండా ఇతర భాషలో సమాధానాలు రాస్తే మూల్యాంకనం చేయరని సూచించారు. కాగా మెయిన్స్‌ పరీక్షలు మొత్తం 7 పేపర్లకు జరగనున్నాయి. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు ఉంటాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.