Open AI: 500 ఇంటర్వ్యూల్లో ఫెయిల్.. ఏఐ ఇచ్చిన ఒక్క చాన్స్‌తో నెలకు రూ. 20 లక్షల జీతం
సవాళ్లు, ఓటములు ఎదురైనప్పుడు చాలామంది నిరుత్సాహపడతారు. కానీ, పట్టుదల ఉంటే ఎంత పెద్ద వైఫల్యాన్ని అయినా అద్భుతమైన విజయంగా మార్చుకోవచ్చని ఈశాన్య భారతదేశానికి చెందిన ఓ యువకుడు నిరూపించాడు. వందల కొద్దీ తిరస్కరణలను ఎదుర్కొన్న అతడు, ఓపెన్ఏఐ ప్రాజెక్ట్‌లో ఉద్యోగం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ అసాధారణ ప్రయాణం, ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది. ఈ యువకుడి స్ఫూర్తిదాయక కథనం గురించి తెలుసుకుందాం.

పట్టుదల ఉంటే ఎంత పెద్ద సవాల్ అయినా ఎదుర్కోవచ్చని ఈశాన్య భారతదేశానికి చెందిన 23 ఏళ్ల యువకుడు నిరూపించాడు. 500కు పైగా ఉద్యోగ దరఖాస్తులు తిరస్కరించిన తర్వాత, అతడు ఓపెన్ఏఐ ప్రాజెక్టులో ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఉన్న ఉద్యోగం సాధించాడు. ఆ ఉద్యోగంలో నెలకు రూ.20 లక్షల వేతనం సంపాదిస్తున్నాడు.
కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేసిన ఈ యువకుడికి మొదట సంవత్సరానికి రూ.3.6 లక్షల జీతంతో ఉద్యోగం వచ్చింది. కానీ ఆ ఉద్యోగంలో చేరడానికి ఎనిమిది నెలలు ఆగాలి. అంతకాలం వేచి చూడడం ఇష్టం లేక అంతర్జాతీయ రిమోట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం మొదలుపెట్టాడు. 500కు పైగా దరఖాస్తులు పంపినా, అతడికి ఒకే ఒక్క ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో నెగ్గి జీవితాన్ని మార్చుకున్నాడు.
కష్టానికి దక్కిన ఫలితం
ఒకే ఒక్క అవకాశం అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ ప్రాజెక్టు అతడికి నెలకు రూ.20 లక్షల వేతనం ఇచ్చింది. మొదటి ఉద్యోగంతో పోలిస్తే ఇది నమ్మశక్యం కాని హైక్. అతడు ప్రాజెక్టు కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. కేవలం 4-5 గంటలు మాత్రమే నిద్రపోయేవాడు. “నైపుణ్యాలు, ఇంటర్నెట్ ఉంటే భౌగోళిక ప్రాంతం అడ్డుకాదు” అని ఆ యువకుడు చెప్పాడు.
ఈ ప్రాజెక్టు ఆగస్టులో ముగిసింది. అయితే అతడి ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. తన సొంత టెక్ సంస్థను ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడు. చిన్న పట్టణాల విద్యార్థులకు అతడు ఇచ్చిన సలహా ఒక్కటే. “దొరికిన జీతమే ఎక్కువని సర్దుకుపోకండి.. ప్రతిచోటా దరఖాస్తు చేయండి, నైపుణ్యాలు పెంచుకోండి” అని చెప్పాడు.




