AP EAPCET Counselling 2024: ఏపీ ఈఏపీసెట్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం.. జులై 19 నుంచి తరగతులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ బీటెక్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు జులై 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మంగళవారం (జులై 9) నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇక జులై 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో విద్యార్ధులకు ధ్రువతపత్రాల పరిశీలన ఉంటుంది. జులై 12వ తేదీ వరకు ఐచ్ఛికాల ఎంపిక చేసుకునే వెసులుబాటు..

AP EAPCET Counselling 2024: ఏపీ ఈఏపీసెట్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం.. జులై 19 నుంచి తరగతులు ప్రారంభం
AP EAPCET 2024 Counselling
Follow us

|

Updated on: Jul 10, 2024 | 6:36 AM

అమరావతి, జులై 10: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ బీటెక్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు జులై 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మంగళవారం (జులై 9) నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇక జులై 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో విద్యార్ధులకు ధ్రువతపత్రాల పరిశీలన ఉంటుంది. జులై 12వ తేదీ వరకు ఐచ్ఛికాల ఎంపిక చేసుకునే వెసులుబాటు ఇస్తారు. ఆప్షన్ల మార్పులకు 13వ తేదీన అవకాశం ఇస్తారు. జులై 16న సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 17 నుంచి 22 వరకు విద్యార్థులకు సంబంధిత కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జులై 19 నుంచి అన్ని కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయి.

ఏపీ ఈఏపీసెట్‌ 2024 పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా బీటెక్‌ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు ఆసక్తి ఉన్న బ్రాంచి, కాలేజీని ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. వెబ్‌ ఆప్షన్స్‌ ఎంపిక సమయంలో విద్యార్థులకు స్పష్టత అవసరం. ముఖ్యంగా ఏ బ్రాంచి ఎంపిక చేసుకోవాలో స్పష్టత ఉండాలి. స్నేహితులు, బంధువులు చెప్పారని కాకుండా ఉద్యోగావకాశాలను దృష్టిలో ఉంచుకుని కోర్సు, కాలేజీని ఎంచుకోవాలి. ఆనక నచ్చని బ్రాంచులను ఎంపిక చేసుకుంటే తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి. ఆసక్తి ఉన్న విభాగంలో సీటు లభిస్తే నైపుణ్యాభివృద్ధితోపాటు అకడమిక్‌గా కూడా రాణించవచ్చు. ధృవపత్రాల పరిశీలకు ఈ సర్టిఫికెట్స్‌ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఏపీ ఈఏపీసెట్‌-2024 ర్యాంకు కార్డు, ఏపీ ఈఏపీసెట్‌-2024 అడ్మిట్‌కార్డు, ఇంటర్మీడియెట్‌ మార్కుల జాబితా, పదో తరగతి మార్కుల జాబితా, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ (టీసీ), స్టడీ సర్టిఫికెట్స్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రం, ఇన్‌కం సర్టిఫికెట్, రేషన్‌ కార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ కలర్‌ ఫొటోలను తమతోపాటు విద్యార్ధులు తీసుకెళ్లవల్సి ఉంటుంది.

తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 232 ఇంజినీరింగ్‌ కాలేజీలకు కొత్తగా అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 24 యూనివర్సిటీ అనుబంధ కాలేజీలు, 208 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. దీంతో ఇంజనీరింగ్‌ విద్యనభ్యసించడానికి ఎక్కువ కాలేజీలు అందుబాటులోకి వచ్చినట్లైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.