Mid-Day Meals: సర్కార్ కీలక నిర్ణయం.. ఇక సెలవు రోజుల్లోనూ బడుల్లో మధ్యాహ్న భోజనం అమలు!
mid-day meals during school holidays in Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల కోసం వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు..

అమరావతి, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల కోసం వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆదివారం కూడా మధ్యాహ్న భోజనం అందించాలని అధికారులు భావిస్తున్నారు.
పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాల సాధనకు విద్యాశాఖ వంద రోజుల ప్రణాళికలో భాగంగా డిసెంబర్ 6వ తేదీ నుంచి సెలవు రోజుల్లోనూ మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని పాఠశాలలకు సెలవు రోజుల్లోనూ మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యార్ధులకు స్టడీ తరగతులు నిర్వహించనున్నారు.
ఆదివారం, సెలవు రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎవైనా రెండు సబ్జెక్టులపై స్టడీలు ఉంటాయి. స్టడీ పూర్తయిన తర్వాత విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం అందించి ఇళ్లకు పంపుతారు. ఈ ఆదివారం భోజనంలో పప్పు, కోడిగుడ్డు కూర వడ్డించారు. తాజా నిర్ణయంతో కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం నూటికి నూరు శాతంగా ఉంది. కొన్నిచోట్ల కాస్త తక్కువగా ఉంది. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి పది విద్యార్థి కచ్చితంగా అన్ని రోజులు బడికి వచ్చేలా చూడాలని ఉపాధ్యాయులను ప్రభుత్వం అదేశించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. పాఠశాల్లోని విద్యార్థులందరికీ నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్కూళ్లకు వచ్చిన విద్యార్థులందరికీ నిర్దేశించిన మెనూ పక్కాగా అమలు చేయాలని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




