TET 2025 Exams: చదువు చెప్పాలా? చదువుకోవాలా?.. గురువుల్లో టెట్ టెన్షన్
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్ధులు, టీచర్లకు నిమిషం ఖాళీలేని పరిస్థితి నెలకొంది. సిలబస్ పూర్తి చేయడం, ప్రిపరేషన్, స్పెషల్ క్లాసులు, స్టడీస్.. అంటూ పుస్తకాలతో కుస్తీ పడుతుంటే.. వారిని చదివించే పనిలో ఉపాధ్యాయులు ఉన్నారు. మరోవైపు ప్రాథమిక, ఉన్నత విద్యలో బోధనా..

అమరావతి, డిసెంబర్ 8: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్ధులు, టీచర్లకు నిమిషం ఖాళీలేని పరిస్థితి నెలకొంది. సిలబస్ పూర్తి చేయడం, ప్రిపరేషన్, స్పెషల్ క్లాసులు, స్టడీస్.. అంటూ పుస్తకాలతో కుస్తీ పడుతుంటే.. వారిని చదివించే పనిలో ఉపాధ్యాయులు ఉన్నారు. మరోవైపు ప్రాథమిక, ఉన్నత విద్యలో బోధనా నైపుణ్యం పెంచడానికి 6 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాల్సిందేనంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే టెట్ నోటిఫికేషన్లు వచ్చేశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం (డిసెంబర్ 10) నుంచి టెట్ పరీక్షలు మొదలుకానున్నాయి. ఇప్పటికే సర్కార్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ క్రమంలో సీనియర్ ఉపాధ్యాయుల్లో టెన్షన్ మొదలైంది. అలాగే 2010 కంటే ముందు ఉపాధ్యాయ వృత్తిలో చేరిన టీచర్లంతా ఆందోళన చెందుతున్నారు. గతంలో టెట్ రాయకుండానే నియామకం పొందిన అనేక మంది ఉపాధ్యాయులు రెండేళ్లలో ప్రభుత్వం విడుదల చేసే టెట్ పరీక్షలో క్వాలిఫై కాకుంటే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది. 5 ఏళ్లకు పైగా సర్వీస్ ఉన్న ప్రతి టీచర్ తప్పకుండా టెట్ రాయాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశాలివ్వడంతో ఎటూ తోచని పరిస్థితి నెలకొంది.
కాంపిటీషన్ పుస్తకాలతో కుస్తీలు…
ఓవైపు పిల్లలకు పాఠాలు చెబుతూనే.. మరోవైపు ఉపాధ్యాయులు కాంపిటీషన్ పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. దీంతో టెట్ అర్హత లేని 2010 కంటే ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు ఇప్పుడు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. ఇప్పటికే టెట్ అర్హత లేని పీజీహెచ్ఎం, ఎస్ఏ ఉపాధ్యాయులు టెట్ పేపర్ 2లో క్వాలిఫై కావాల్సి ఉండగా.. ఎస్జీటీ, ఎస్జీటీ లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులు టెట్ పేపర్ 1 క్వాలిఫై కావాల్సి ఉంది. వీరు సీనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందాలంటే టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాల్సిందే. రెండేళ్ల గడువులో మొత్తం 4 సార్లు నిర్వహించే టెట్ పరీక్షల్లో వీరంతా ఉత్తీర్ణత సాధించాలని గడువు విధించడంలో టీచర్ల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. టెట్ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండడంతో ఎలాంటి మాస్ కాపీయింగ్, అక్రమాలకు సైతం అవకాశం ఉండదు. ఎన్నో ఏళ్ల తర్వాత పరీక్షలు రాయాల్సి రావడంతో టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందనే భయం, ఒత్తిడి వీరిని చిత్తు చేస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




