AP TET 2024 Notification Today: నేడే ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల.. జులై 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. త్వరలో వెలువడనున్న డీఎస్సీ కంటే ముందే మరోమారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయాత్తం అవుతోంది. ఈ క్రమంలో సోమవారం (జులై 1) ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఈరోజు ప్రకటన..
అమరావతి, జులై 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. త్వరలో వెలువడనున్న డీఎస్సీ కంటే ముందే మరోమారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయాత్తం అవుతోంది. ఈ క్రమంలో సోమవారం (జులై 1) ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఈరోజు ప్రకటన వెలువరించనున్నట్లు ఏపీ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. సోమవారం నోటిఫికేషన్ వెలువరించినా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను జులై 2న అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత జులై 3 నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫీజు చెల్లించనున్నారు. దరఖాస్తు రుసుము చెల్లించేందుకు జులై 16 వరకు అవకాశం కల్పించనున్నారు. ఇక జులై 4 నుంచి 17 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. టెట్ పరీక్షలను ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
టెట్ నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, షెడ్యూల్, సిలబస్‌ను కూడా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. టెట్ ఆన్‌లైన్ పరీక్షకు సంబంధించిన సూచనలు, విధివిధానాలను కూడా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచనుంది. ఈ మొత్తం సమాచారం జులై 2 నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఇతర ఏదైనా సందేహాలు, సమాచారం కోసం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని ఆయన సూచించారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ టెట్ అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా గత ప్రభుత్వం ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వరకు టెట్ నిర్వహించగా.. ఇటీవలే ఫలితాలు వెలువడ్డాయి. దాదాపు 2.35లక్షల మంది టెట్ పరీక్షలకు హాజరైతే, వారిలో 1,37,903 మంది అంటే 58.46శాతం మంది అర్హత సాధించారు. ఇక మెగా డీఎస్సీకి వారం రోజుల్లో ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. టెట్‌కు డీఎస్సీకి మధ్య కనీసం 30 రోజుల వ్యవధి ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం ఎన్నికల ముందు జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 పోస్టులతో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటనని రద్దు చేస్తూ విద్యాశాఖ జూన్ 30న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీఓ నం.256ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే 16,347 పోస్టులతో కొత్తగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనుంది. మెగా డీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో కొత్తగా బీఈడీ, డీఎడ్ పాసైన అభ్యర్థులతో పాటు ఇటీవల టెట్‌లో అర్హత సాధించని వారికి కూడా అవకాశం కల్పిస్తూ కొత్తగా మళ్లీ టెట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.