RBI Portable Payment System: అత్యవసర సమయాల్లో చింతలేని చెల్లింపులు.. కొత్త చెల్లింపు విధానాన్ని తీసుకువస్తున్న ఆర్‌బీఐ
ప్రత్యేకంగా కీలకమైన లావాదేవీలను సులభతరం చేయడానికి, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యత ప్రవాహాన్ని కొనసాగించడానికి రూపొందించినట్లు తెలుస్తోంది. లైట్ వెయిట్ పోర్టబుల్ పేమెంట్ సిస్టమ్ (ఎల్‌పీపీఎస్) స్వయంప్రతిపత్తితో పని చేస్తుంది. ఇది సంప్రదాయ సాంకేతికతలకు భిన్నంగా ఉంటుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకృతి వైపరీత్యాలు లేదా యుద్ధం వంటి అత్యవసర సమయాల్లో చెల్లింపు వ్యవస్థల అంతరాయం లేకుండా పని చేసేందుకు పోర్టబుల్ చెల్లింపు వ్యవస్థను రూపొందించిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యవస్థ ప్రత్యేకంగా కీలకమైన లావాదేవీలను సులభతరం చేయడానికి, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యత ప్రవాహాన్ని కొనసాగించడానికి రూపొందించినట్లు తెలుస్తోంది. లైట్ వెయిట్ పోర్టబుల్ పేమెంట్ సిస్టమ్ (ఎల్‌పీపీఎస్) స్వయంప్రతిపత్తితో పని చేస్తుంది. ఇది సంప్రదాయ సాంకేతికతలకు భిన్నంగా ఉంటుంది. అలాగే ఎక్కడి నుంచైనా కనీస సిబ్బందితో నిర్వహించవచ్చు. గతంలో ఆర్టీజీఎస్, నెఫ్ట్, యూపీఐ వంటి చెల్లింపు వ్యవస్థలు అధిక లావాదేవీల వాల్యూమ్‌లను సమర్థవంతంగా ప్రాసెస్ చేయడానికి, అంతరాయం లేని లభ్యతను నిర్వహించడానికి సంక్లిష్టమైన వైర్డు నెట్‌వర్క్‌లతో పాటు అధునాతన ఐటీ మౌలిక సదుపాయాలపై ఎక్కువగా ఆధారపడేవి. అయితే, ఈ వ్యవస్థలు ప్రకృతి వైపరీత్యాలు లేదా సంఘర్షణ సమయాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటాయి, ఇది వాటి కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంది. అలాగే ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి గణనీయమైన ముప్పును కలిగిస్తుందని ఆర్‌బీఐ తన తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. అందువల్ల ఇలాంటి అనూహ్య పరిస్థితుల నుంచి రక్షణ కోసం ఈ కొత్త చెల్లింపుల విధానాన్ని తీసుకోస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు వంటి సమయాల్లో లక్ష్యాన్ని సాధించడానికి ఆర్‌బీఐ సాంప్రదాయ సాంకేతికతలపై ఆధారపడకుండా స్వయంప్రతిపత్తితో పని చేసేలా రూపొందించబడిన చెల్లింపు వ్యవస్థ అయిన ఎల్‌పీఎస్ఎస్‌ను ప్రవేశపెట్టింది. ఎల్‌పీఎస్ఎస్ కనీస హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుందని ఆర్బీఐ అంచనా వేస్తుంది. అలాగే ఈ చెల్లింపు వ్యవస్థ అవసరమైనప్పుడు మాత్రమే యాక్టివేట్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం, మార్కెట్ సంబంధిత లావాదేవీలు వంటి ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని నిర్వహించడానికి కీలకమైన లావాదేవీలను నిర్వహించడానికి ఈ వ్యవస్థ రూపొందించారు. ఇలాంటి వ్యవస్థను అమలు చేయడం వల్ల దేశంలోని చెల్లింపు, సెటిల్‌మెంట్ వ్యవస్థలో డౌన్‌టైమ్ గణనీయంగా తగ్గుతుందని ఆర్థిక నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బల్క్ పేమెంట్‌లు, ఇంటర్‌బ్యాంక్ చెల్లింపుల, పార్టిసిపెంట్ ఇన్‌స్టిట్యూషన్‌లకు నగదును అందించడం వంటి క్లిష్టమైన చెల్లింపు సేవలను నిరంతరాయంగా నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ ప్రవాహాన్ని నిర్వహించడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే యుద్ధ సమయంలో బంకర్ పనిచేసే విధంగానే కొత్త వ్యవస్థ చెల్లింపు వ్యవస్థలో పని చేస్తుందని ఆర్‌బీఐ అంచనా వేస్తుంది. ఈ మెరుగైన డిజిటల్ చెల్లింపులపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడానికి అత్యంత సవాలుగా ఉన్న పరిస్థితుల్లో కూడా మొత్తం ఫైనాన్షియల్ మార్కెట్ అవస్థాపనను బలోపేతం చేయడానికి సాయం చేస్తుందని ఆర్‌బీఐ అధికారులు పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి