AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate: త్వరలో రూ.లక్షకు చేరుకోనున్న పది గ్రాముల బంగారం.. ఈ పసిడి పరుగులు ఎందాకా..?

అమ్మో అనిపిస్తోంది బంగారం ధర. పెరగడమే తప్ప..తగ్గడమే లేదనట్టు దూసుకువెళ్తోంది. దీంతో కొందామంటే ఒక భయం..ఆగుదామంటే ఇంకో భయంగా ఉంది..గోల్డ్‌ లవర్స్‌ పరిస్థితి. త్వరలోనే 10గ్రాముల బంగారం ధర రూ. లక్ష దాటడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ పుత్తడి పరుగు ఎంతవరకూ..? లక్ష టార్గెట్‌ ఈ ఏడాదే రీచ్‌ అవుతుందా..? ఎక్స్‌పర్ట్స్‌ ఏమంటున్నారు..?

Gold Rate: త్వరలో రూ.లక్షకు చేరుకోనున్న పది గ్రాముల బంగారం.. ఈ పసిడి పరుగులు ఎందాకా..?
Gold Rate
Balaraju Goud
|

Updated on: Feb 18, 2025 | 5:57 PM

Share

పసిడి పరుగులు ఆగట్లేదు. ఊహించిన దానికంటే వేగంగా పరిగెడుతోంది. తొలిసారి 89 వేల రూపాయల మార్కు తాకి, ఆల్ టైమ్‌ హైని టచ్‌ చేసింది గోల్డ్‌. నేను మాత్రం తక్కువ తిన్నానా అన్నట్లు వెండి కూడా పరుగులు తీస్తోంది. ఈ పసిడి పరుగులు ఎందాకా? లక్షను టచ్‌ చేసి ఆగుతుందా? ఇంకా ముందుకు సాగుతుందా?

సప్త సముద్రాలు దాటి ఉన్న ఒక దేశ అధ్యక్షుడు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరను శాసిస్తున్నాడు. అవును, ఇది పూర్తిగా నిజం. అమెరికాలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలుచుకుంటే, భారతదేశంలో తులం బంగారం (10 గ్రాములు) ధర లక్ష రూపాయలు దాటుతుంది. ఎలా అనుకుంటున్నారా? భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో బంగారం ధర ఆకాశానికి అంటుతోంది. త్వరలోనే 10గ్రాముల బంగారం ధర రూ. లక్ష దాటడం ఖాయంగా కనిపిస్తోంది

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, లండన్‌లోని థ్రెడ్ స్ట్రీట్ కింద ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వ నుండి అమెరికా బంగారాన్ని ఆర్డర్ చేయడం ప్రారంభించింది. ఈ విధంగా, ఇప్పటివరకు 8,000 బంగారు కడ్డీలు అమెరికాలోని న్యూయార్క్ గోల్డ్ రిజర్వ్‌కు చేరుకున్నాయి. దీని కారణంగా న్యూయార్క్ గోల్డ్ రిజర్వ్ 17.5 మిలియన్ ట్రాయ్ ఔన్సుల నుండి 34 మిలియన్ ట్రాయ్ ఔన్సులకు పెరిగింది.

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వ లండన్‌లోని థ్రెడ్ నీడిల్ స్ట్రీట్ కింద ఉంది. ఇక్కడ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాలలో రూ.22 లక్షల కోట్ల విలువైన బంగారం నిక్షిప్తం చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద వ్యాపారవేత్తలు తమ బంగారాన్ని ఈ బ్యాంకులో దాచుకుంటారు. అటువంటి పరిస్థితిలో, అమెరికా తన బంగారాన్ని వెనక్కి తీసుకోవడం రాబోయే రోజుల్లో దాని ధర పెరుగుతుందని సూచిస్తుంది.

అమెరికా తన బంగారు నిల్వలను పెంచుకుంటున్న తీరును బట్టి చూస్తే, రాబోయే రోజుల్లో డోనాల్డ్ ట్రంప్ బంగారం దిగుమతులపై భారీగా సుంకం విధించవచ్చని స్పష్టమవుతోంది. ఇది జరిగితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరగడం సహజం. గత కొన్ని నెలల్లో భారతదేశంలో బంగారం దిగుమతులు 41 శాతం పెరిగాయి. దీని కారణంగా, రాబోయే రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. లక్ష దాటవచ్చంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..