8th Pay Commission: మా డిమాండ్లు నెరవేర్చాల్సిందే.. పట్టువీడని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు
భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రతి గ్రాడ్యుయేట్‌కు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే డ్రీమ్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే సదుపాయాలు ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉండవు అనేది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న ఎనిమిదో వేతన సవరణ కమిషన్ గురించి మరిన్ని వివరాలను తెలుసకుందాం.

ఉద్యోగుల స్థితిగతులతో పాటు పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో వారికి ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం వేతన కమిషన్ ద్వారా జీతాలను పెంచుతూ ఉంటుంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను మెరుగుపరచడానికి 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విషయంలో ఫిబ్రవరి 10, 2025న సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) కార్యదర్శి, జాతీయ మండలి (స్టాఫ్ సైడ్), జాయింట్ కన్సల్టేటివ్ మెకానిజం (ఎన్‌సీ-జేసీఎం) సభ్యుల మధ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. వేతన సంఘం కోసం ప్రతిపాదిత నిబంధనలను చర్చించడం కోసమే సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన అనేక ముఖ్యమైన డిమాండ్లు ఆయా సంఘాల నేతలు లేవనెత్తారు. కనీస వేతన స్థిరీకరణ, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించడం, రిస్క్ అలవెన్స్, గ్రేడ్ పేలో మెరుగుదల, వివిధ అలవెన్సులను తిరిగి పరిశీలించడం వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ప్రధాన డిమాండ్ల గురించి తెలుసుకుందాం.
టీఓఆర్‌లో సరళత
8వ వేతన సంఘం నిబంధనలలో అన్ని కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల ఉమ్మడి సమస్యలను చేర్చగలిగేలా ఒక నిబంధన ఉండాలని ఉద్యోగి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా రైల్వేలు, రక్షణ మంత్రిత్వ శాఖలతో సంబంధం ఉన్న ఉద్యోగుల నిర్దిష్ట సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మంత్రిత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల ప్రమాదకర ఉద్యోగాలు, తరచుగా జరిగే ప్రమాదాలను కూడా ఉద్యోగ సంఘాలు ప్రస్తావిస్తున్నాయి. వారి ఉద్యోగ నిర్వహణకు సంబంధించిన రిస్క్‌ను పరిగణలోకి తీసుకుని వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
కనీస వేతన స్థిరీకరణ
కనీస వేతనాన్ని నిర్ణయించడానికి ఐదుగురు సభ్యుల కుటుంబం అనే భావనను స్వీకరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తల్లిదండ్రులు అంటే సీనియర్ సిటిజన్ల నిర్వహణ సంక్షేమ చట్టం, 2022 ప్రకారం, పిల్లలు తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన చట్టపరమైన బాధ్యతను కలిగి ఉన్నారని కాబట్టి ముగ్గురు సభ్యుల కుటుంబానికి బదులుగా ఐదుగురు సభ్యుల కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదనంగా వారు ప్రస్తుత జీవన ప్రమాణాలతో పాటు పోషక అవసరాలను పరిగణనలోకి తీసుకునే గౌరవప్రదమైన జీవన వేతనం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
పెన్షన్ సంబంధిత డిమాండ్లు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు 12 సంవత్సరాల్లో పాక్షికంగా చేర్చబడిన పెన్షన్‌ను పునరుద్ధరించాలని కోరుతున్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ పెంచాలనే డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శాశ్వతంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇచ్చే స్థిర వైద్య భత్యం (ఎఫ్ఎంఏ)ని నెలకు ₹ 3,000 కు పెంచాలని డిమాండ్ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌హెచ్ఎస్) కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇతర డిమాండ్లు
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అతి ప్రాచీన శాఖ అయిన ఇండి పోస్ట్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ శాఖు సంబంధించిన గ్రామీణ డాక్ సేవకులు (జిడీఎస్), అసిస్టెంట్ గ్రామీణ డాక్ సేవకులకు కూడా ఎన్నికల కమిషన్ ఉద్యోగులకు కూడా 8వ వేతన సంఘం పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




