TVS Jupiter: కొత్త టెక్నాలజీతో టీవీఎస్ జూపిటర్.. ప్రత్యేకతలు, ఫీచర్లు ఇవే..!
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ తన మార్కెట్ ను మరింత విస్తరించుకుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను విడుదల చేస్తూ ప్రజలకు మరింత దగ్గరవుతోంది. ఈ కంపెనీ వాహనాలకు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ అందరికీ ఉపయోగపడేలా వాహనాలను తయారు చేయడం టీవీఎస్ ప్రత్యేకత. ఈ నేపథ్యంలో 2025 జూపిటర్ 110ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దాని ప్రత్యేకతలు, ధర వివరాలను తెలుసుకుందాం.

టీవీఎస్ విడుదల చేసిన లేటెస్ట్ జూపిటర్ 110 స్కూటర్ లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఓబీడీ2బి ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. ఈ స్కూటర్ ధర రూ.76,691 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఓబీడీ2బీ కి అనుగుణంగా ఉన్న వాహనాల శ్రేణి సెన్సార్ టెక్నాలజీ, ఆన్ బోర్డు సామర్థ్యాలతో ఉంటుంది. గాలి – ఇంధన మిశ్రమం, ఇంజిన్ ఉష్ణోగ్రత, ఇంధన పరిమాణం, ఇంజిన్ వేగానికి సంబంధించిన డేటాను సేకరించే సెన్సార్లను అమర్చుతారు. ఆన్ బోర్డు ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ఈసీయూ)తో వాహనాలు జీవితకాలమంతా శుభ్రంగా, పర్యావరణ అనుకూలమైన రీతిలో పనిచేస్తాయి. అలాగే మన్నిక కూడా చాలా మెరుగ్గా ఉంటుంది.
టీవీఎస్ కంపెనీ గతేడాది జూపీటర్ ఇంజిన్ ను నవీకరించింది. ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ కలిగిన 113.3 సీసీ ఇంజిన్ ఏర్పాటు చేసింది. దాని నుంచి 5000 ఆర్పీఎం వద్ద 7.91 బీహెచ్పీ గరిష్ట శక్తి, 9.2 ఎన్ఎం టార్క్ ను విడుదల అవుతుంది. గంటకు గరిష్టంగా 82 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. ఆకర్షణీయమైన రంగుల్లో టీవీఎస్ జూపిటర్ ఎంతో ఆకట్టుకుంటోంది. డాన్ బ్లూ మ్యాట్, గెలాక్టిక్ కాపర్ మ్యాట్, టైటానియం గ్రే మ్యాట్, స్టార్ లైట్ బ్లూ గ్లోస్, లూనార్ వైట్ గ్లోస్, మీటియోర్ రెడ్ గ్లోస్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.
కొత్త జూపిటర్ స్కూటర్ లో కస్టమర్లకు ఉపయోగపడే అనేక ఫీచర్లు ఏర్పాటు చేశారు. రెండు హెల్మెట్లు పెట్టుకోగల అండర్ సీట్ స్టోరేజీ, మొబైల్ పరికరాలను చార్జింగ్ చేసుకోవడానికి యూఎస్ బీ పోర్టు, ఇంధన ట్యాంకుకు బయట మూత, ఎల్ఈడీ లైటింగ్ ఆకట్టుకుంటున్నాయి. బ్లూ టూత్ కనెక్టివిటీ, వివిధ అప్లికేషన్లకు మద్దతు ఇచ్చే ఆధునిక డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చారు. టీవీఎస్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఆటో మేటిక్ టర్న్ ఇండికేటర్లు, డిస్టెన్స్ టు ఎంపీ ఇండికేటర్, వాయిస్ కమాండ్ సామర్థ్యం, హాజార్డ్ ల్యాంపులు, ఫాలో మీ హెడ్ ల్యాంప్ లను అమర్చారు.
టీవీఎస్ జూపిటర్ నాలుగు రకాల వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ డ్రమ్ వేరియంట్ ధర రూ.76,691. అన్నింటిలో ఇదే అతి తక్కువ ఖరీదైన మోడల్. అలాగే డ్రమ్ వేరియంట్ ధర రూ.82,441 పలుకుతోంది. దీనిలో మెరుగైన లుక్, మన్నిక కోసం అల్లాయ్ వీల్స్ ఏర్పాటు చేశారు. ఇక డ్రమ్ ఎస్ఎక్సీ వేరియంట్ రూ.85,991కు అందుబాటులోకి వచ్చింది. దీనిలో అదనపు స్లైలింగ్, కన్వీనియన్స్ ఫీచర్లు ఉన్నాయి. చివరిదైన డిస్క్ ఎస్ఎక్సి వేరియంట్ రూ.89,791 పలుకుతోంది. దీనిలో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అమర్రచారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




