Stock Market: బుల్ జోరుకు బ్రేకులు.. భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు.. కారణం ఏమంటే..?
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. బుధవారం ఉదయం నుంచి లాభాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపటికే నేలచూపులు చూశాయి.
Stock Markets downfall: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. బుధవారం ఉదయం నుంచి లాభాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపటికే నేలచూపులు చూశాయి. అక్కడి నుంచి మధ్యాహ్నం వరకు ఊగిసలాట ధోరణిలో సాగిన ట్రేడింగ్.. యూరప్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. అటు అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో ట్రేడవుతుండడంతో ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. ఇదిలావుంటే, చమురు ధరలు పెరుగుతుండడం యూరప్ దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, దేశీయంగా ఇవాళ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశాలు మొదలయ్యాయి. అయితే, కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఇప్పటి వరకు అవలంబించిన సర్దుబాటు ధోరణికి ఆర్‌బీఐ స్వస్తి పలకనుందనే సంకేతాలు మదుపర్లను కలవపెట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే దేశీయ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. మరోవైపు, డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీగా పతనమై రూ.75.02 వద్ద ఆరు నెలల కనిష్ఠ స్థాయికి చేరుకుంది.
దేశీయ మార్కెట్లను ఓసారి పరిశీలిస్తే.. బుధవారం ఉదయం సెన్సెక్స్ 59,942.00 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 59,963.57 – 59,079.86 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు 555.15 పాయింట్ల నష్టంతో 59,189.73 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ మార్కెట్ నిఫ్టీ 195.30 పాయింట్లు కోల్పోయి 17,627.00 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, బజాజ్ ఫినాన్స్ మాత్రమే లాభపడ్డాయి. అధిక నష్టాలు చవిచూసిన వాటిలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, రిలయన్స్, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, టైటన్, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు ఉన్నాయి.
Post Office Scheme: రూ. 100 పెట్టుబడి పెడితే.. ఐదేళ్లలో రూ. 20 లక్షలు సంపాదించవచ్చు..