Nobel Prize 2021: కెమిస్ట్రీలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి.. మూడోరకం ఉత్ప్రేరకాన్ని కనిపెట్టినందుకే!
Nobel Prize in Chemistry 2021: ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతలను ప్రకటిస్తున్నారు. రాసాయన శాస్త్రంలో పరిశోధనలకు గానూ ఇద్దరికి సంయుక్తంగా ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్కింది.
Nobel Prize 2021: ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఒక్కోరోజు ఒక్కో రంగానికి సంబంధించిన వారికి బహుమతులు ప్రకటిస్తున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన నోబెల్ బహుమతుల సందడిలో మొదటి రోజు వైద్య రంగానికి చెందిన అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపోటియన్ లకు బహుమతి ప్రకటించారు. తరువాత రెండోరోజు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతిక శాస్త్రంలో నోబెల్ వరించింది. శాస్త్రవేత్తలు సుకురో మనాబో, క్లాస్ హాసిల్‌మన్, జార్జియో పారిసీలను ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.
ఇక మూడోరోజైన ఈరోజు (6 అక్టోబర్ 2021) రసాయన శాస్త్రానికి సంబంధించి నోబెల్ బహుమతి ప్రకటించారు. ఈసారి ఈ బహుమతి బెంజమిన్ లిస్ట్, డేవిడ్ మాక్ మిలన్ లకు లభించింది.
BREAKING NEWS: The 2021 #NobelPrize in Chemistry has been awarded to Benjamin List and David W.C. MacMillan “for the development of asymmetric organocatalysis.” pic.twitter.com/SzTJ2Chtge
— The Nobel Prize (@NobelPrize) October 6, 2021
“అసమాన ఆర్గానోకాటాలిసిస్” (asymmetric organocatalysis) అని పిలువబడే అణువులను నిర్మించడానికి కొత్త మార్గాన్ని అభివృద్ధి చేయడంలో వారు చేసిన కృషికి గాను ఈ ఏడాది నోబెల్ బహుమతి ప్రదానం చేస్తున్నట్టు నోబెల్ ప్యానెల్ సభ్యురాలు పెర్నిల్లా విట్టుంగ్-స్టాఫ్‌షెడ్ చెప్పారు. అంతేకాకుండా, “ఇది ఇప్పటికే మానవాళికి ఎంతో మేలు చేస్తోంది” అని ఆమె వెల్లడించారు.
అసమాన ఆర్గానోకాటాలిసిస్(asymmetric organocatalysis) అంటే..
ఉత్ప్రేరకాలు రసాయన శాస్త్రవేత్తలకు ప్రాథమిక సాధనాలు, అయితే సూత్రప్రాయంగా కేవలం రెండు రకాల ఉత్ప్రేరకాలు అందుబాటులో ఉన్నాయని పరిశోధకులు చాలాకాలంగా విశ్వసిస్తున్నారు. అవి లోహాలు..ఎంజైమ్‌లు. బెంజమిన్ లిస్ట్, డేవిడ్ మాక్ మిలన్ 2000 లో ఒకదానికొకటి స్వతంత్రంగా, మూడవ రకం ఉత్ప్రేరకాన్ని అభివృద్ధి చేశారు. దీనిని అసమాన ఆర్గానోకాటాలిసిస్ అని పిలుస్తారు. ఇది చిన్న సేంద్రీయ అణువులపై నిర్మితమైంది.
“ఉత్ప్రేరకం కోసం ఈ భావన చాలా తెలివైనది. వాస్తవానికి మనం ఇంతకు ముందు ఎందుకు ఆలోచించలేదని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు” అని కెమిస్ట్రీ కోసం నోబెల్ కమిటీ ఛైర్మన్ జోహన్ అక్విస్ట్ చెప్పారు.
సేంద్రీయ ఉత్ప్రేరకాలు కార్బన్ అణువుల స్థిరమైన చట్రాన్ని కలిగి ఉంటాయి. వీటికి మరింత క్రియాశీల రసాయన సమూహాలు జోడించడం జరుగుతుంది. ఇవి తరచుగా ఆక్సిజన్, నత్రజని, సల్ఫర్ లేదా భాస్వరం వంటి సాధారణ అంశాలను కలిగి ఉంటాయి. దీని అర్థం ఈ ఉత్ప్రేరకాలు పర్యావరణ అనుకూలమైనవి. ఇవి ఉత్పత్తి చేయడానికి చౌకగా ఉంటాయి.
నోబెల్ బహుమతి ప్రకటన షెడ్యూల్ ఇదీ
ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతులను ప్రకటిస్తారు. ఈ సంవత్సరం అంటే 04 అక్టోబర్ నుంచి నోబెల్ బహుమతుల ప్రకటన ప్రారంభించారు. మొదట వైద్యానికి సంబంధించి నోబెల్ విజేతలను ప్రకటించగా.. రెండో రోజు అంటే 05 అక్టోబర్ నాడు భౌతిక శాస్త్రంలో నోబెల్ విజేతలను ప్రకటించారు. ఇక మూడోరోజైన ఈరోజు (06 అక్టోబర్) రసాయన శాస్త్రంలో విజేతలను ప్రకటించారు. ఇక రేపు గురువారం (07 అక్టోబర్) సాహిత్యంలో.. శుక్రవారం (08 అక్టోబర్) ఆర్ధిక శాస్త్రంలో.. శనివారం (09 అక్టోబర్) శాంతికి సంబంధించి నోబెల్ బహుమతులను ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి: Nobel Prize: వైద్యశాస్త్రంలో ఇద్దరు నోబెల్ బహుమతి.. అమెరికాకు చెందిన డేవిడ్ జూలియస్, అర్డెమ్ పటాపౌటియన్‌లకు పురస్కారం