Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా ఆస్తులు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఒక్క రోజు ఆదాయం ఎంతంటే..?
ఢిల్లీ వీధుల్లో సాధారణ వ్యక్తిగా మొదలై, నేడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నటుడిగా ఎదిగారు షారుఖ్.. అభిమానుల ప్రేమతో పాటు కళ్లు చెదిరే ఆస్తులు ఆయన సొంతం. మన్నత్ బంగ్లా, ప్రైవేట్ జెట్ సహా ఎన్నో ఆస్తులను కూడబెట్టారు. బాలీవుడ్ బాద్‌షా మొత్తం ఆస్తుల విలువ ఎంత...? వేటి ద్వారా ఆయనకు ఎక్కువ ఆదాయం వస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ 60వ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఢిల్లీ వీధుల్లో సాధారణ వ్యక్తిగా ప్రయాణం మొదలుపెట్టి, నేడు సినీ ఇండస్ట్రీకి కింగ్‌గా, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటులలో ఒకరిగా నిలిచారు. కృషి, అంకితభావం, ప్యాషన్ అనే మూడు అస్త్రాలతో షారుఖ్ ఖాన్ సాధించిన ఈ అసాధారణ స్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే నుంచి ఇటీవల వచ్చిన పఠాన్, జవాన్ వంటి బ్లాక్‌బస్టర్ల వరకు ఆయన సినీ ప్రయాణం అసాధారణమైనది.
షారుఖ్ ఆస్తుల విలువ ఎంతంటే..?
షారుఖ్ ఖాన్ కేవలం హృదయాలను మాత్రమే కాదు.. అపారమైన సంపదను కూడా గెలుచుకున్నారు. ఇటీవల విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 నివేదిక ప్రకారం.. షారుఖ్ ఖాన్ ఇప్పుడు అధికారికంగా బిలియనీర్ అయ్యారు. నివేదిక ప్రకారం.. ఆయన నికర విలువ 1.2 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ.12,490 కోట్లు అన్నమాట. ఈ అపారమైన సంపద ఆయన్ని ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటులలో ఒకరిగా చేసింది.
ఎక్కువ ఆదాయం వీటి నుంచే
కింగ్ ఖాన్‌కు ఎక్కువ డబ్బు తెచ్చిపెట్టేది 2002లో ఆయన భార్య గౌరీ ఖాన్‌తో కలిసి ప్రారంభించిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్. నేడు ఇది దేశంలోని అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచింది. దీని విలువ 5 బిలియన్లకు పైగా ఉంది. దీంతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ IPL జట్టులో షారుఖ్ వాటా కూడా ఆయనకు ఎక్కువ డబ్బు తెచ్చిపెడుతుంది. అదనంగా ఆయన కొన్ని పెద్ద బ్రాండ్‌లకు ప్రచారం చేయడం, పెట్టుబడుల ద్వారా చాలా సంపాదిస్తున్నారు.
లగ్జరీ ఇల్లు – కార్ల కలెక్షన్
షారుఖ్ ఖాన్2కు దేశ, విదేశాలలో అనేక విలాసవంతమైన ఆస్తుల ఉన్నాయి. ముంబైలో ఉన్న ఆయన ప్రసిద్ధ బంగ్లా.. మన్నత్.. సుమారు రూ.200 కోట్ల విలువైనది. అంతేకాకుండా, ఆయన ఢిల్లీలో ఒక విలాసవంతమైన ఇంటిని, అలీబాగ్‌లో కోట్లు విలువ చేసే బీచ్‌సైడ్ ఫామ్‌హౌస్‌ను, అలాగే లండన్, దుబాయ్‌లలో కూడా విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్నారు. లగ్జరీ కార్ల విషయానికి వస్తే.. దాదాపు రూ.350 కోట్ల విలువైన గల్ఫ్‌స్ట్రీమ్ G550 ప్రైవేట్ జెట్ ఆయన సొంతం. ఆయన వద్ద రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్, BMW i8 వంటి అనేక లగ్జరీ కార్లు, దాదాపు రూ.4 కోట్ల విలువైన కస్టమైజ్డ్ వానిటీ వ్యాన్ కూడా ఉన్నాయి.
అసాధారణమైన కెరీర్
షారుఖ్ ఖాన్ 100కి పైగా చిత్రాలలో నటించారు. 15 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, దేశ అత్యున్నత పౌర గౌరవాలలో ఒకటైన పద్మశ్రీ, ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి లెజియన్ ఆఫ్ ఆనర్‌తో సహా అనేక అవార్డులు అందుకున్నారు. ఇటీవల ఆయన జవాన్ చిత్రానికి గానూ తన తొలి జాతీయ ఉత్తమ నటుడు అవార్డును కూడా గెలుచుకున్నారు. 60 ఏళ్లు నిండినా..షారుఖ్ అభిమానులను అలరించడానికి ఎప్పుడూ ముందుంటారు.




