Credit Card: ఈ విషయాలు తెలుసుకోకుండానే క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. ఇబ్బందులను ఏరికోరి తెచ్చుకున్నట్లే..
క్రెడిట్ కార్డ్ మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఈ మోసానికి సంబంధించిన వార్తలు వింటుంటాం. ఇటీవల ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించి ఒక పెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌తో కస్టమర్లు రూ. 2.6 కోట్లు నష్టపోయారు. కాబట్టి క్రెడిట్ కార్డు వాడేవారు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి..

క్రెడిట్ కార్డు మోసాలు ఈ మధ్య కాలంలో అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను ఓ ముఠా టార్గెట్ చేసి కోట్లు కొల్లగొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మోసంలో సుమారు 350 మంది రూ. 2.6 కోట్ల వరకు నష్టపోయారు. ఈ కేసులో ఆరు నెలల తర్వాత పోలీసులు 18 మందిని అరెస్టు చేశారు. ఇందులో కాల్ సెంటర్ ఉద్యోగులు, ప్రాంతీయ ఏజెంట్లు, సిమ్ కార్డు ప్రొవైడర్లు, క్రిప్టోకరెన్సీ వినియోగదారులు వంటి అనేకమంది ఉన్నారు. ఈ మోసగాళ్ల ఉచ్చులో పడకుండా, అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఈ నేపధ్యంలో క్రెడిట్ కార్డ్ మోసాల నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవచ్చో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
ఎవరికీ చెప్పొద్దు:
మీ క్రెడిట్ కార్డ్ ఓటీపీ, సీవీవీ, పిన్ లేదా పాస్‌వర్డ్ వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరికీ చెప్పకండి. బ్యాంక్ అధికారినంటూ మీకు ఎవరైనా మీకు కాల్ చేసినా లేదా మెసేజ్ చేసినా మీ సమాచారాన్ని పంచుకోవడం చాలా ప్రమాదకరం. గుర్తుంచుకోండి, ఏ బ్యాంకూ మీకు కాల్ చేసి ఇలాంటి సమాచారం అడగదు.
బ్యాంక్ కాల్స్:
మీకు బ్యాంక్ నుండి ఏదైనా కాల్ వచ్చి, వారు సమాచారం అడిగితే, ముందుగా వారి గుర్తింపును సరిచూసుకోండి. దీని కోసం మీరు అధికారిక బ్యాంక్ వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి నిర్ధారించుకోవచ్చు. అనుమానాస్పద కాల్‌లను ఎప్పుడూ నమ్మవద్దు.
లావాదేవీలపై అలర్ట్ :
మీ బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై నిరంతరం దృష్టి పెట్టండి. మీ మొబైల్‌లో లావాదేవీ హెచ్చరికలను సెట్ చేసుకోండి. తద్వారా ఏదైనా అనధికార లావాదేవీ జరిగితే మీకు వెంటనే తెలుస్తుంది. ఏదైనా అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే, వెంటనే మీ బ్యాంకుకు, పోలీసులకు తెలియజేయండి.
డిజిటల్ సేఫ్టీ:
బ్యాంకింగ్ లేదా డబ్బు సంబంధిత లావాదేవీలు చేసేటప్పుడు పబ్లిక్ వైఫైని ఉపయోగించవద్దు. మీ మొబైల్, బ్యాంకింగ్ యాప్‌లను ఎల్లప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండండి. గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆప్‌స్టోర్ నుండి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి. వాట్సాప్ లేదా ఇమెయిల్‌లో వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దు.
తక్షణ చర్య :
ఒకవేళ మీరు ఏదైనా మోసం జరిగిందని అనుమానిస్తే, వెంటనే మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయండి. తర్వాత వెంటనే మీ బ్యాంకుకు తెలియజేయండి. పోలీసులకు ఫిర్యాదు చేయండి. మీరు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. త్వరితగతిన చర్య తీసుకోవడం వలన మీ నష్టాలను తగ్గించుకోవచ్చు.
ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు ఆర్థిక మోసాల నుండి మిమ్మల్ని మీరు సులభంగా రక్షించుకోవచ్చు. అవగాహనతో ఉండటమే మోసగాళ్లను ఎదుర్కొనే మొదటి అడుగు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




