Paytm playback: నెలవారీ ఖర్చులు సాంగ్ రూపంలో వినొచ్చు! పేటియంలో క్రేజీ ఫీచర్!
మీరు ప్రతినెలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియట్లేదా? అయితే దానికోసం బోలెడు యాప్స్ ఉన్నాయి. నెలవారీ ఖర్చుల్ని లెక్క కట్టి మీకు చూపిస్తాయి. అయితే ఇదే ఫీచర్ ను పేటియం.. కాస్త వెరైటీగా తీసుకొస్తోంది. మీ ఖర్చుల వివరాలన్నింటినీ ర్యాప్ సాంగ్ రూపంలోకి మార్చి మీకు వినిపిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే..

పేటీయం యాప్.. తన యాప్‌లో ‘ప్లే బ్యాక్’ అనే కొత్త ఏఐ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మీ ఖర్చుల వివరాలు తెలుసుకోవచ్చు. మీరు నెలలో ఏయే పనులకు ఎంతెంత ఖర్చు పెడుతున్నారో ర్యాప్ సాంగ్ రూపంలో వినొచ్చు. మీ ఖర్చుల వివరాలను ఏఐ.. ఒక సాంగ్ లిరిక్స్ గా మార్చి .. ట్యూన్ తో మీకు వినిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కూడా అందిచేలా పేటియం ఈ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.
ర్యాప్ సాంగ్
షాపింగ్, ఫుడ్, ట్రావెల్, యుటిలిటీ బిల్లులు.. ఇలా ప్రతి నెలా రకరకాల ఖర్చులు, బిల్లులను పేటియం ద్వారా పేమెంట్ చేస్తుంటారు. వీటిని యాప్.. కేటగిరీలుగా విభజించి.. ర్యాప్ సాంగ్ గా మారుస్తుంది. ఈ ప్లేబ్యాక్ ఫీచర్ మీ ఖర్చులపై ఓ కొత్త పర్ స్పెక్టివ్ ను అందిస్తుందని, యూజర్లు ఖర్చుల వివరాలన్నీ ఒకేసారి తెలుసుకోవడమే కాకుండా వాటిని విశ్లేషణ చేసుకుని, ఖర్చు అలవాట్లపై అవగాహన పెంపొందిచుకునే విధంగా ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని పేటియం చెప్తోంది. అంతే కాదు ఈ ర్యాప్ సాంగ్ ను మీరు మీ సోషల్ మీడియాల్లో కూడా అప్ లోడ్ చేసుకోవచ్చు. ఖర్చుల వివరాలను ఇంటరాక్టివ్ అనుభవంగా మార్చడం ద్వారా ఆర్థిక అవగాహనను ప్రోత్సహించడానికి ప్లేబ్యాక్‌ను ఒక సాధనంగా పనికొస్తుందని కంపెనీ చెప్తోంది.
ఆప్షన్ ఎక్కడుంటుందంటే..
ఈ కొత్త ఫీచర్ ఏఐ ఆధారితంగా పనిచేస్తుంది. ఈ ఫీచర్ ను యాక్సెస్ చేయడం కోసం పేటీఎం యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్ డేట్ చేసి.. బ్యాలెన్స్ అండ్ హిస్టరీ విభాగంలోకి వెళ్లి.. అక్కడ కనిపించే ప్లేబ్యాక్ ఆప్షన్ ని ఎంచుకోవాలి. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా స్టేజ్ లో ఉంది. త్వరలోనే మరిన్ని మార్పులతో అప్ డేట్ అవ్వొచ్చు.
ఇకపోతే ఇండియాలో ఎక్కువగా వాడే పేమెంట్ యాప్స్ లో పేటియం ఒకటి. ఈ యాప్ భారతదేశంలో మొట్టమొదటి సారిగా క్యూఆర్ కోడ్ చెల్లింపులు, సౌండ్‌బాక్స్ టెక్నాలజీని తీసుకొచ్చింది. అలాగే ఈ యాప్ లో బడ్జెట్ ట్రాకింగ్, కస్టమైజ్డ్ యూపీఐ ఐడీలు, బిల్ రిమైండర్లు.. ఇలా చాలా ఫీచర్లు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి
