May 30, 2026
Subhash
రైల్వే నిరుపయోగంగా ఉన్న వస్తువులు, పాత సామాగ్రి (Scrap) విక్రయించడం ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 2025-26 లో రైల్వే శాఖ ఊహించని స్థాయిలో లాభాలను సాధించింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో రైల్వే బోర్డు పాత స్క్రాప్ అమ్మకం ద్వారా ఏకంగా రూ.6,813.86 కోట్ల ఆదాయాన్ని గడించింది. ప్రభుత్వం విధించుకున్న లక్ష్యం కంటే ఇది చాలా ఎక్కువ.
ఈ ఆర్థిక సంవత్సరానికి రైల్వే రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ-వేలం (e-Auction) పద్ధతుల ద్వారా ఏకంగా రూ.813 కోట్లకు పైగా అదనపు ఆదాయం లభించింది.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25) లో కూడా రైల్వే శాఖ రూ. 5,400 కోట్ల టార్గెట్‌కు బదులుగా రూ.6,641.78 కోట్ల విలువైన స్క్రాప్‌ను విక్రయించి రికార్డు సృష్టించింది.
రైల్వే డిపోలు, వర్క్‌షాప్‌లలో పేరుకుపోయిన పాత ట్రాక్స్, పనికిరాని వ్యాగన్లు, పాత కోచ్‌లు, వాడేసిన లోకోమోటివ్ ఇంజన్లు, ఇతర ఇనుప సామాగ్రిని ఈ వేలంలో విక్రయిస్తారు.
స్క్రాప్ అమ్మకం ద్వారా రైల్వేకు అదనపు ఆదాయం రావడమే కాకుండా, డిపోలు, యార్డులలో వృథాగా ఉన్న స్థలం ఖాళీ అవుతుంది. దీనివల్ల స్టేషన్ల పరిసరాలు శుభ్రంగా మారి, పర్యావరణానికి మేలు జరుగుతుంది.
ఇలాంటి అదనపు మార్గాల ద్వారా ఆదాయం పెరగడం వల్ల ప్రయాణికుల టికెట్ ధరలను పెంచాల్సిన అవసరం లేకుండానే రైల్వే స్టేషన్లలో ఆధునిక వసతులు, డిజిటల్ లాంజ్‌లు, మెరుగైన భద్రతను రైల్వే కల్పిస్తోంది
ఇలా భారత రైల్వే శాఖ ప్రతి ఏడాది పాత సామాగ్రిని విక్రయించడం ద్వారా భారీ మొత్తంలో లాభాలను గడిస్తోంది. ఈ మొత్తం ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది.