AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పక్షి మెనూలో మొసళ్లు కూడా.. వేట కోసం గంటల తరబడి విగ్రహంలా…!

భారీ బూటు ఆకారంలోని ముక్కు, భయపెట్టే చూపు, విగ్రహంలా గంటల తరబడి కదలకుండా నిలబడి వేటాడే ప్రత్యేక నైపుణ్యం.. ఇవన్నీ షూబిల్ పక్షిని ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన పక్షుల్లో ఒకటిగా నిలబెట్టాయి. ఆఫ్రికాలోని చిత్తడి నేలల్లో కనిపించే ఈ అరుదైన పక్షి ప్రధానంగా చేపలను ఆహారంగా తీసుకుంటుంది.

ఈ పక్షి మెనూలో మొసళ్లు కూడా.. వేట కోసం గంటల తరబడి విగ్రహంలా...!
Shoebill Bird
Ram Naramaneni
|

Updated on: May 31, 2026 | 10:11 PM

Share

ప్రపంచంలో కొన్ని జంతువులు, పక్షులను చూస్తే అవి నేటి కాలానికి చెందినవి కాకుండా లక్షల ఏళ్ల క్రితం జీవించిన ప్రాచీన జీవుల్లా కనిపిస్తాయి. అలాంటి అరుదైన పక్షుల్లో ఒకటి షూబిల్ (Shoebill). దీని భారీ ఆకారం, భయపెట్టే చూపు, అసాధారణ వేట తీరు చూసినవారు దీనిని “డైనోసార్ పక్షి” అని కూడా పిలుస్తుంటారు.

ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్, ఉగాండా, జాంబియా, టాంజానియా వంటి దేశాల చిత్తడి నేలల్లో కనిస్తుంది ఈ పక్షి. దాదాపు 1.5 మీటర్ల ఎత్తు వరకు పెరిగే ఈ పక్షి రెక్కలు విప్పితే 2.5 మీటర్ల వరకు విస్తరిస్తాయి. అందుకే ఇది ప్రపంచంలోని అతిపెద్ద పక్షుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

బూటు ఆకారంలో ముక్కు

షూబిల్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని భారీ ముక్కు. ఇది దాదాపు 24 సెంటీమీటర్ల పొడవు ఉండి, బూటును పోలి ఉంటుంది. అందుకే దీనికి “షూబిల్” అనే పేరు వచ్చింది. ఈ ముక్కు కేవలం అందం కోసం కాదు.. వేటలో ఇది అత్యంత శక్తివంతమైన ఆయుధం.

విగ్రహంలా నిలబడి వేట

చాలా పక్షులు వేట కోసం ఎగురుతూ తిరుగుతుంటే, షూబిల్ మాత్రం భిన్నం. ఇది గంటల తరబడి నీటిలో కదలకుండా నిలబడి తన ఆహారం కోసం ఎదురుచూస్తుంది. సరైన అవకాశం కనిపించగానే ఒక్కసారిగా ముందుకు దూకి తన భారీ ముక్కుతో వేటను పట్టుకుంటుంది. ఈ సహనం, కచ్చితత్వం దీనిని అద్భుతమైన వేటగాడిగా నిలబెట్టాయి.

చిన్న మొసళ్లూ మెనూలోనే!

షూబిల్ ప్రధానంగా పెద్ద చేపలను ఆహారంగా తీసుకుంటుంది. ముఖ్యంగా లంగ్‌ఫిష్, క్యాట్‌ఫిష్ వంటి చేపలను ఇష్టపడుతుంది. అయితే చేపలతో పాటు కప్పలు, నీటి పాములు, బల్లులు, చిన్న తాబేళ్లు, అప్పుడప్పుడు చిన్న మొసలి పిల్లలను కూడా వేటాడిన సందర్భాలు నమోదయ్యాయి. అందుకే దీనిని ఆఫ్రికా చిత్తడి నేలలలోని అత్యంత శక్తివంతమైన వేటగాళ్లలో ఒకటిగా భావిస్తారు.

మెషిన్ గన్‌ను తలపించే శబ్దం

షూబిల్ సాధారణంగా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ తన ముక్కును వేగంగా ఒకదానికొకటి కొట్టినప్పుడు వచ్చే ‘క్లాటరింగ్’ శబ్దం మెషిన్ గన్ కాల్పులను తలపిస్తుంది. ఈ శబ్దాన్ని విన్నవారు మొదట ఆశ్చర్యానికి గురవుతారు.

అరుదైన జాతి

ప్రపంచంలో షూబిల్ పక్షుల సంఖ్య చాలా తక్కువ. చిత్తడి నేలలు తగ్గిపోవడం, నివాస ప్రాంతాలు నాశనం కావడం వల్ల ఇవి ప్రమాదంలో ఉన్న జాతుల జాబితాలో చేరాయి. ప్రస్తుతం వీటి సంరక్షణ కోసం పలు ఆఫ్రికన్ దేశాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.

ప్రకృతి సృష్టించిన అద్భుతం

భారీ ముక్కు, వింత రూపం, అసాధారణ వేట నైపుణ్యం, మెషిన్ గన్‌లా వినిపించే శబ్దం.. ఇవన్నీ కలిపి షూబిల్‌ను ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన పక్షుల్లో ఒకటిగా నిలబెట్టాయి. లక్షల ఏళ్ల క్రితం కాలం నుంచి వచ్చిన జీవిలా కనిపించే ఈ పక్షి, ప్రకృతి సృష్టించిన నిజమైన అద్భుతమనే చెప్పాలి.

Follow Us