AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త రూల్స్‌.. మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లకు బిగ్‌ అలర్ట్‌! సెబీ కీలక సూచనలు

డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల కోసం సెబీ కొత్త నామినేషన్ నిబంధనలను ప్రకటించింది. సెప్టెంబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ మార్పులతో గరిష్టంగా ముగ్గురు నామినీలను చేర్చుకోవచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలు మరింత సులభతరం కాగా, పెట్టుబడుల బదిలీ ప్రక్రియ వేగవంతం కానుంది.

కొత్త రూల్స్‌.. మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లకు బిగ్‌ అలర్ట్‌! సెబీ కీలక సూచనలు
Sebi Nomination Rules
SN Pasha
|

Updated on: May 31, 2026 | 9:03 PM

Share

డీమ్యాట్‌ ఖాతాలు, మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు కలిగిన కోట్లాది మంది భారతీయ పెట్టుబడిదారులకు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) కీలక సూచనలు జారీ చేసింది. పెట్టుబడిదారుల మరణానంతరం ఆస్తుల బదిలీని సులభతరం చేయడం, క్లెయిమ్‌ చేయని ఆర్థిక ఆస్తుల సంఖ్యను తగ్గించడం లక్ష్యంగా నామినేషన్‌ నిబంధనల్లో పలు మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలు 2026 సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అందువల్ల పెట్టుబడిదారులు ఆ తేదీలోపు తమ నామినీ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొత్త నిబంధనల ప్రకారం ఒక డీమ్యాట్‌ ఖాతా లేదా మ్యూచువల్‌ ఫండ్‌ ఫోలియోకు గరిష్టంగా ముగ్గురు నామినీలను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఒకటి కంటే ఎక్కువ మంది నామినీలు ఉంటే, పెట్టుబడిదారుడి మరణం తర్వాత వారు ఉమ్మడిగా పెట్టుబడిని కొనసాగించవచ్చు లేదా తమ వాటా ప్రకారం వేర్వేరు ఖాతాల్లో ఆస్తులను బదిలీ చేసుకోవచ్చు. నామినేషన్‌ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు సెబీ డిజిటల్‌ సౌకర్యాలను విస్తరించింది. ఆన్‌లైన్‌లో డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టిఫికేట్‌ (DSC), ఆధార్‌ ఆధారిత ఈ-సిగ్నేచర్‌, ఇతర చెల్లుబాటు అయ్యే ఎలక్ట్రానిక్‌ సంతకాలు, OTP ఆధారిత టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (2FA) ద్వారా నామినేషన్‌ నమోదు చేయవచ్చు. ఆఫ్‌లైన్‌ విధానంలో సాధారణ సంతకం సరిపోతుంది. వేలిముద్ర ద్వారా దరఖాస్తు చేసే సందర్భంలో మాత్రమే ఇద్దరు సాక్షులు అవసరం.

అలాగే నామినేషన్‌ ఫారంలో ఇవ్వాల్సిన వివరాలను కూడా సెబీ తగ్గించింది. నామినీ పేరు, పెట్టుబడిదారుడితో సంబంధం, మైనర్‌ నామినీ అయితే జనన తేదీ వంటి ప్రాథమిక వివరాలు మాత్రమే తప్పనిసరి. మొబైల్‌ నంబర్‌, ఈమెయిల్‌, కేవైసీ వివరాలు, వాటా శాతం వంటి అంశాలు ఐచ్ఛికంగా ఉంచారు. ఒకవేళ వాటా శాతం పేర్కొనకపోతే, పెట్టుబడులు నామినీల మధ్య సమానంగా విభజించబడతాయి.

పెట్టుబడిదారులు ఎప్పుడైనా నామినీని చేర్చడం, మార్చడం లేదా తొలగించడం చేయవచ్చని సెబీ స్పష్టం చేసింది. ప్రతి మార్పుకు సంబంధిత సంస్థ రసీదు ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్‌ చేయని పెట్టుబడిదారులకు ఏడాదికి రెండుసార్లు SMS, ఇమెయిల్‌ ద్వారా గుర్తు చేసే వ్యవస్థను కూడా అమలు చేయనున్నారు. కుటుంబ సభ్యులు భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు నామినేషన్‌ నమోదు చేయడం అత్యంత అవసరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us