Mother Dairy: వినియోగదారులకు మరో షాక్.. మదర్ డెయిరీ పాల ధర పెంపు!
ముందే ధరలు మండిపోతున్నాయి. నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పాల ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యుడికి తీవ్ర..
ముందే ధరలు మండిపోతున్నాయి. నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పాల ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యుడికి తీవ్ర భారంగా మారుతోంది. సంపాదన పెద్దగా పెరగకపోయినా.. వివిధ పదార్థాలు, వస్తువుల ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇక ప్రతి ఇంట్లో టీ తాగే అలవాటు అందరికి ఉండేది. ఇందు కోసం రోజువారీగా పాలు తప్పనిసరి అవసరం. అన్నింటి ధరలు పెరుగుతున్నాయ్.. మేమెందుకు పెరగకూడదన్నట్లు పాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అమూల్‌తో పాటు ఇతర కంపెనీల పాల ధరలు ఇప్పటికే పెరుగగా, ప్రముఖ పాల ఉత్పత్తి, పంపిణీదారు సంస్థ అయిన మదర్ డెయిరీ దేశంలోని పలు ప్రాంతాల్లో పాల ధరను పెంచింది. లీటర్ ఫుల్‌క్రీమ్ పాల ధరపై రూపాయి, టోకెన్ పాలధర రెండు రూపాయల చొప్పున పెంచినట్టు మదర్ డెయిరీ తెలిపింది.
పెరిగిన ధరలకు అనుగుణంగా లీటరు టోకెన్ పాలధర 48 రూపాయల నుంచి 50 రూపాయలకు చేరింది. అర లీటరు ఫుల్ క్రీమ్ పాల ధరను మాత్ర యథాతథంగా ఉంచింది. లీటర్ ఫుల్ క్రీమ్ పాల ధర 63 రూపాయల నుంచి 64 రూపాయలకు పెరిగింది. పెరిగిన ధరలు నవంబర్ 21 నుంచి అమల్లోకి వస్తాయని మదర్ డెయిరీ వెల్లడించింది. అయితే ధరలు పెంచడానికి గల కారణాలను వివరించింది మదర్ డెయిరీ. ఇన్‌పుట్ ధర పెరగడంతో పాల ధరలు పెంచక తప్పలేదని పేర్కొంది. పశుగ్రాసం, దాణా వంటి ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడంతో తప్పనిసరిగా ధరలు పెంచాల్సి వచ్చిందని మదర్ డెయిరీ ప్రతినిధులు తెలిపారు. ఈ సంవత్సరం మదర్ డెయిరీ పాల ధరలు పెంచడం ఇది నాలుగోసారి. మదర్ డెయిరీ ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ప్రతి రోజూ 30 లక్షల లీటర్లకు పైగా పాలను సరఫరా చేస్తుంది. ఇలా పాల ధరలు పెరగడంతో సామాన్యుడికి సైతం టీ చేసుకుని తాగడం భారంగా మారుతోంది. ఒకప్పుడు ఇరవై, ముప్పై రూపాయల్లోపు వచ్చే పాలు.. ఇప్పుడు రెట్టింపు అయ్యాయి.
కాగా, ఇప్పటికే విజయ, ఆమూల్, హెరిటేజ్ పాల ధరలను పెంచగా, ఇప్పుడు మదర్ డెయిరీ కూడా అదే బాటలో నడుస్తోంది. ఈ పాల ధరల పెంపె సామాన్యులకు కొంత భారంగానే మారనున్నాయి. పాల ఉత్పత్తుల డిమాండ్‌కు సరఫరా మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉందని మదర్ డెయిరీ అధికార ప్రతినిధి చెబుతున్నారు. డిమాండ్‌కు తగినట్లు పాల సరఫరా జరగడం లేదని, ఫెస్టివ్ సీజన్ తర్వాత తలెత్తిన పరిణామాలతో పాల ధరలు పెంచక తప్పడం లేదని మదర్ డెయిరీ వెల్లడించింది. పాల ఉత్పత్తికి అయ్యే ఖర్చుల్లో 75-80 భారం వినియోగదారులపైనే మదర్ డెయిరీ మోపుతుంది. ఇంతకుముందు మదర్ డెయిరీ గత నెల 16న ఫుల్ క్రీమ్ మిల్క్, గోవు పాలు లీటర్‌కు రూ.2 పెంచేసింది. మార్చి, ఆగస్టు నెలల్లో రూ.2 చొప్పున మదర్ డెయిరీ ధరలు పెంచివేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..