Budget 2023: ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు ఎప్పుడో తెలుసా.. ఈ ముసాయిదాను ఎవరు, ఎప్పుడు సిద్ధం చేస్తారంటే..
2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనుంది. మొదటి విడత జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభమైన రోజునే ఆర్థిక సర్వే నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెడతారు.
మీరు మీ కుటుంబ ఆదాయం, ఖర్చుపై కుటుంబ బడ్జెట్‌ను సిద్ధం చేసినట్లే.. కేంద్ర బడ్జెట్ కూడా అదే పద్ధతిలో భారత వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. బడ్జెట్ పత్రాలు ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు నిర్దిష్ట ఆర్థిక సంవత్సరం ముగింపు కోసం కేంద్రం రాబడి, వ్యయాలను కలిగి ఉంటాయి. బడ్జెట్ పత్రాలు అన్ని వనరుల నుంచి వచ్చే ఆదాయాలు, అన్ని కార్యకలాపాల ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. నీతి ఆయోగ్, ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖలతో సంప్రదించిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ పత్రాలను తయారు చేస్తుంది. సాధారణంగా, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పిస్తారు. అయితే, ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 8న ముగిసే అవకాశం ఉంది.
తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
2023 బడ్జెట్‌ను ఎవరు సమర్పిస్తారంటే..
గత సంవత్సరం మాదిరిగానే, 2023-24 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి సమర్పించనున్నారు. ఈ సంవత్సరం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ పత్రాన్ని సమర్పించనున్నారు. ముఖ్యంగా 2023-24 బడ్జెట్ సీతారామన్ ఐదవ కేంద్ర బడ్జెట్. ఆమె బడ్జెట్‌ను సమర్పించే ముందు రోజు మన ఆర్ధిక మంత్రి సీతారామన్ జనవరి 31న పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను చదవనున్నారు.
బడ్జెట్ 2023 ఎలా తయారు చేయబడింది?
బడ్జెట్ తయారీ అనేది సంప్రదింపులు, ప్రణాళిక , అమలుతో కూడిన చక్కగా నిర్వచించబడిన ప్రక్రియను కలిగి ఉంటుంది. ఈ విషయాలను అమలు చేయడానికి నెలల సమయం పడుతుంది. బడ్జెట్ తయారీ కార్యకలాపాలు సాధారణంగా ఆగస్టు-సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి సరిగ్గా ఆరు నెలల ముందు దీనిని రెడీ చేస్తారు.
బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా (జనవరి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు) జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు, రెండో విడతలో మార్చి 6న తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 6న ముగియనున్నట్టు సమాచారం. ఈ సమావేశాల తొలి రోజునే ఆర్థిక సర్వే నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెడతారని అధికారులు తెలిపారు. బడ్జెట్ సమావేశాల తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసే తీర్మానంపై చర్చించనున్నారు. అలాగే, కేంద్ర బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారని వెల్లడించారు.
ఇకపోతే, రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో వివిధ మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చించడం.. బడ్జెట్‌కు ఆమోదం తెలపడం వంటివి చేపట్టనున్నారు. మరోవైపు పార్లమెంటు కొత్త భవనం సెంట్రల్ విస్టా పనులు చురుగ్గా సాగుతున్నాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలను సెంట్రల్ విస్టా హాలులోనే నిర్వహించేందుకు భవనాన్ని సిద్ధం చేస్తామని నిర్మాణ సంస్థ పేర్కొంటోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం